టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలుపుతూ... ఆర్టీసీ ఉద్యోగులు... ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించామని... న్యాయ సలహా కోరడంతో బిల్లుకు ఆమోదం కాస్త ఆలస్యమైందని అన్నారు. ఇంతకాలం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగిందని... బిల్లు ఆపడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి స్పందిస్తూ... ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా కొన్ని విమర్శలు రావడం సహజమని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్ కు ఆర్టీసీ కార్మికులు సదా రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. కాగా... కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టి... అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపగా.. బిల్లులోని పలు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఉద్యోగుల పే స్కేల్ తో పాటు మొత్తం పది అంశాల్లో మరింత స్పష్టత ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం వివరణ పంపగా.. సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తాజాగా బిల్లుపై సంతకం పెట్టారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆనందోత్సాహాలు తెలుపుతూ వేడుకలు జరుపుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos