మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి తదితర నేతలు భేటీ అయి.. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించిన క్రమంలో తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. కాంగ్రెస్ నేతల  నుంచి  ఆహ్వానం అందిన క్రమంలో ... ఈ నెల 5న ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం  ఖరారు చేసుకున్నారు. పాలేరు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని... దీంతో.. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకనేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే... పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తుమ్మల రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంతగడ్డ అయిన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటిసారి ఓటమి పాలైనా... ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన మొత్తం ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985,1994,1999, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు.  2016లో బీఆర్ఎస్ లో చేరారు.  ఆ పార్టీ నుంచి పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన... కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా రాజకీయంగా ఎంతో పట్టు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే... క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తుమ్మల ఎంట్రీతో కాంగ్రెస్ కు లాభమా... నష్టమా అనేది ఎన్నికల్లో తేలిపోనుందని విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos