ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగిన సస్పెన్స్ ఇటీవల వీడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహాయుతి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో... ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త మలుపు తిరిగాయి. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు అసెంబ్లీలో ఏర్పాటు చేయగా ... ఈ ప్రమాణ స్వీకారానికి మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు దూరంగా ఉన్నారు. తాము ఇవాళ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేది లేదని ఉద్ధవ్ ఠాక్రే శివసేన నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా జరగలేదని.. ఈవీఎంల ద్వారా మహాయుతి కూటమి విజయం సాధించిందని.. దాన్ని తాము అంగీకరించడం లేదని ఆదిత్య ఠాక్రే తెలిపారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని... అందుకు నిరసనగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం లేదని... మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. ఈ ఫలితాలపై మరాఠా ప్రజలు కూడా సంతృప్తి చెందలేదని, ఈవీఎంల విషయంలో తప్పు జరిగిందని, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారని తెలిపారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆదిత్య ఠాక్రే ఎద్దేవా చేశారు.
ఇక ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ తీవ్ర ఆగ్రహం చేస్తూ... ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి రుజువు లేదని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలు ఉంటే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. ఇదిలాఉండగా ఇవాళ ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి ఈవీఎంల పని తీరుపై పలువురు నేతలు పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos