యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026' నిబంధనలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నిబంధనలు సమాజాన్ని విభజించేలా ఉన్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు యూజీసీ ఇటీవల విడుదల చేసిన కొత్త యాంటీ-డిస్క్రిమినేషన్ రూల్స్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ నిబంధనల అమలును తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, వీటి వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
యూజీసీ కొత్త నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, కేంద్ర ప్రభుత్వంతో పాటు యూజీసీకి నోటీసులు జారీ చేసింది.ఈ నిబంధనలు స్పష్టంగా లేవని, ఇవి సమాజాన్ని విడదీసేలా లేదా సమాజంలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ తరహా నిబంధనలు విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావాన్నిచూపుతాయని, అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అనివార్యమని కోర్టు పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కొత్త రూల్స్ అమల్లో ఉండవని, 2012 నాటి పాత మార్గదర్శకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
రోహిత్ వేముల, పాయల్ తద్వి వంటి విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. క్యాంపస్‌లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,మహిళల రక్షణ కోసం యూజీసీ ఈ కొత్త రూల్స్ తెచ్చింది. ఇందులో ప్రధానంగా.. ఈక్విటీ కమిటీలు అంటే ప్రతి కాలేజీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయడం, నిబంధనలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేయడం లేదా నిధులు నిలిపివేయడం వంటి కఠిన శిక్షలు ఉన్నాయి. అయితే, ఈ నిబంధనల వల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, తప్పుడు ఫిర్యాదులతో వారిని వేధించే అవకాశం ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు ఇప్పటికే ఈ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఇప్పుడు ఆ ప్రక్రియ నిలిచిపోనుంది. రోహిత్ వేముల ఉదంతం జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట్ల ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అణగారిన వర్గాల విద్యార్థులు ఈ స్టే పట్ల అసహనం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విద్యార్థులు వివక్ష లేని క్యాంపస్ కావాలని కోరుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos