దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయాలను తీసుకుంది. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించడమే కాకుండా సీబీఐ దర్యాప్తు సైతం నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్న ఉద్దేశంతో.. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది. ముగ్గురు సభ్యులు ఉండే ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నాయకత్వాన్ని వహిస్తారు.

కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్.. సుప్రీంకోర్టును ఇదివరకే ఆశ్రయించిన విషయం తెలిసిందే. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ఆయన అప్పీల్ కు వెళ్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తొక్కిసలాటలో ప్రభుత్వం, టీవీకే పక్షాల వాదోపవాదాలను ఆలకించి.. తాజా ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని విజయ్ తొలుత.. మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు గడప తొక్కారు. సిట్ తో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తొక్కిసలాట ఘటనపై టీవీకేతో పాటు, తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు, పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు జీఎస్ మణి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను వెలికి తీయడానికి సీబీఐతో విచారణ జరిపించాలని మణి తన పిటిషన్ లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పిటిషన్లు కూడా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సమక్షానికిి వచ్చాయి. వీటిని ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడుకే చెందిన బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇందులోనే క్లబ్ చేయడానికి ఈ ధర్మాసనం ఒప్పుకొంది. తమిళనాడు పోలీసు అధికారులు మాత్రమే విచారణ జరిపితే నిష్పక్షపాతంగా ఉండదని ఉమా ఆనందన్ వాదించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై  సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos