వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ఆయన గ్రూప్ కుపెనీలకు ఆర్థిక సలహాదారుగా ఛార్టర్డ్ అకౌంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరు కావాలంటూ అక్టోబరు 23న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై విజయసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో... హెటిరోలకు భూకేటాయింపులు, జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులు, రాంకీ ఫార్మా, వాన్ పిక్ ప్రాజెక్టులు, దాల్మియా సిమెంట్స్ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాలను, అందులో సాక్షుల వాంగ్మూలాలను ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్ పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక అభిప్రాయాన్ని వెల్లడించింది. వీటితోపాటు జగతి పబ్లికేషన్స్ విలువ మదింపుపై డెల్లాయిట్ ఇచ్చిన నివేదిక, విజయసాయిరెడ్డి చిరునామాతో డెల్లాయిట్ పంపిన బిల్లు, జగతి పెట్టుబడులపై ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. 2017, 2021 2022లో మూడు దఫాలుగా వెల్లడించిన ప్రాథమిక అభిప్రాయాల్లో విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు వెల్లడించింది. ఇదే అభిప్రాయంతో క్రమశిక్షణ కమిటీ ఏకీభవిస్తూ తుది నిర్ణయం నిమిత్తం విచారణ చేపట్టాలని నిర్ణయించి విజయసాయిరెడ్డికి తాఖీదు పంపింది.
దాల్మియా సిమెంట్స్ వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి పొందడంలో సాయిరెడ్డి ఈమెయిళ్లలో సంకేత భాషను వాడినట్లు సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది. 2010 డిసెంబరు 31న సాయిరెడ్డి పంపిన ఈమెయిల్ లో 3500 టన్నుల స్టాక్ అందిందని... 2011 జనవరి నాటికి మరో 500 టన్నులు సరపరా చేస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దాల్మియాలో జేఆర్ (జగన్ రెడ్డి) ఖాతాను పరిశీలిస్తే రూ. 35 కోట్లు అందాయని... కోట్లకు బదులు టన్నులు అనే సంకేత భాషను వాడారని సీబీఐ పేర్కొంది. 2010 -11 మధ్య జగన్ కు నిధులను సమకూర్చడంలో సాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. జగన్ తో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి విజయసాయిరెడ్డి చురుకైన పాత్ర పోషించారని ఐసీఏఐ పేర్కొంది. ఆయన డైరెక్టర్ గా రాజీనామా చేసిన అనంతరం కూడా ఆ కంపెనీతో, జగన్ తో సన్నిహితంగా ఉంటూ పెట్టుబడులు రాబట్టారు. మదింపు నివేదికను తారుమారు చేయడంలో ఆయన పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని, వృత్తిపరమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జగన్ కు, ఆయన కంపెనీలకు సహకరించారని అది ఛార్టర్డ్ అకౌంటెంట్ గా ఉండి చేయాల్సింది కాదని పేర్కొంది. దీనిపైన ఐసీఏఐ మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos