కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు. డ్రోన్ ఆధారిత రాడార్ సాయంతో నాలుగో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విలయంలో 200 మందికిపైగా గాయపడ్డారు. భారీ వర్షాలు, ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితులు లేకపోవడం, భారీ పరికరాల కొరత వంటివి సహాయక చర్యలను ఆటంక పరుస్తున్నాయి. పేరుకుపోయిన బురద, నేల కూలిన వృక్షాలు, భవనాలను తొలగించడం కష్టంగా మారింది.
సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఉన్న కొండచరియలు విరిగిపడి ఇరువంజిపుళ నదిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర కొట్టుకుపోతున్న వైనం చూస్తే.. ఈ విలయం ఎంత పెద్దదన్నది ఇట్టే అర్థమవుతుంది. అరేబియా సముద్ర తీరంలో దట్టమైన మేఘాల ధోరణిని సైంటిస్టులు ముందుగానే గుర్తించారు. ఈ దట్టమైన మేఘాలే ఈ పెను విషాదానికి కారణమయ్యాయి.
వయనాడ్ లో పెను విషాదానికి గురైన రెండు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందుకు అనుగుణంగా అక్కడి నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచాలని జియో నిర్ణయించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారుల వినతితోఆ ప్రాంతంలో ప్రత్యేక టవర్ ను ఏర్పాటు చేసింది. బాధితులను త్వరగా కాపాడి.. సురక్షిత ప్రాంతాలకు పంపేందుకు కీలకమైన మొబైల్ నెట్ వర్కు వేగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వయానాడ్ లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు గడువు ముగిసిన వినియోగదారులకు నిరంతర కనెక్టివిటీని అందించేందుకు మూడు రోజుల పాటు రోజుకు ఒక జీబీ ఉచిత మొబైల్ డేటా.. అపరిమితమైన కాలింగ్.. రోజుకు వంద మెసేజ్ లు పంపేందుకు వీలుగా ఎయిర్ టేల్ నిర్ణయం తీసుకుంది. అక్కడున్న దుర్బర పరిస్థితుల్లో రీఛార్జ్ చేయలేని నిస్సహాయత ఉండటంతో సదరు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు సైతం తమ బిల్లుల్ని నెల తర్వాత చెల్లించేలా నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు, అటవీశాఖ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 40 బృందాలు ఆరు జోన్లుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos