జీఎస్టీ సంస్కరణల అమలుతో దేశంలో జీఎస్టీ బచత్ ఉత్సవ్ కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరో తీపి కబురు చెప్పారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2025 ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మేము ఇక్కడితో ఆగిపోవడం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ముందుకు సాగుతామని పన్నులను క్రమంగా తగ్గిస్తామని చెప్పారు.

2014కు ముందు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు దేశ ప్రజలకు అబద్ధాలు చెబుతూ వచ్చాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల ఆదాయాలను పెంచామన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వృద్ధికి కొత్త ఊతం ఇస్తాయని, ఈ మార్పుల ద్వారా జీఎస్టీ రిజిస్ట్రేషన్ మరింత సులభతరం అవుతుందని, పన్ను వివాదాలు తగ్గుతాయని, ఎంఎస్ఎంఈలకు వేగంగా రిఫండ్లు అందుతాయన్నారు. చిప్ నుంచి షిప్ వరకు అన్నీ భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని ప్రధాని చెప్పారు. 

భారత్ లో తయారు అయ్యే మొత్తం మొబైల్ ఫోన్లలో 55 శాతం యూపీలో తయారవుతున్నాయని. సెమీకండక్టర్ రంగంలో యూపీ భారత్ యొక్క స్వావలంబనను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఇతర దేశాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నామని వెల్లడించారు. డిఫెన్స్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని, రష్యా సహాయంతో ఏర్పాటైన ఫ్యాక్టరీలో త్వరలోనే ఏకే-203 రైఫిళ్ల తయారీని ప్రారంభిస్తామన్నారు. యూపీలో ఒక రక్షణ కారిడార్ నిర్మితమవుతున్నదని తెలిపారు. కాలపరీక్షలతో మన బంధం మరింత బలోపేతం అవుతోందని రష్యాపై మోదీ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ఈ ట్రేడ్‌షోకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా అంశాన్ని ప్రస్తావించారు.

Related Videos