ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ... ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా... రాష్ట్రంలో ఏదో ఒక కొత్త పరిణామం చోటు చేసుకోవడం సాధారణమై పోయింది. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలకు ముందు ఢిల్లీలో పర్యటిస్తుండటంపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన ఈ పర్యటనలో ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రులను కలవనున్నారని... ఏపీకి రావలసిన నిధులు, బకాయిలపైనా... పోలవరం నిర్మాణం తదితర అంశాలపైనా చర్చిస్తారని చెబుతున్నారు కానీ... అంతకుమించి కీలక అంశాలు చర్చించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసింది. ఢిల్లీ పాలన అధికారాల విషయంలో సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో చట్ట సవరణ చేయాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటులో చట్టాన్ని నెగ్గించుకోవడానికి గాను.. రాజ్యసభలో వైసీపీకి ఉన్న సంఖ్యా బలాన్ని బీజేపీ కోరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా... ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిపాం సివిల్ కోడ్ వ్యవహారం కూడా పార్లమెంటు సమావేశాల్లో తెరపైకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావాలన్నా... వైసీపీ మద్దతు అవసరం. కాగా... ఇది మైనార్టీ ఓట్లతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఈ విషయంలో వైసీపీ స్పందన ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. లోక్‌సభలో బీజేపీకి మిత్రపక్షాల సహకారం అవసరం లేకపోయినా రాజ్యసభలో మాత్రం కీలక బిల్లుల విషయంలో వైసీపీ సహకరిస్తోంది. ఈ అంశాలపై బీజేపీ పెద్దలు ... జగన్ తో చర్చిస్తారని... ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే క్రమంలో వారికి జగన్... పెద్ద వినతుల జాబితానే ఇస్తారని అంటున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos