వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేయగానే అలా ఆమోదించి గెజిట్ రిలీజ్ చేసేశారు కేంద్ర మంత్రి ధన్‌ఖడ్. అంటే ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఆ సీటు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇంకా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చేస్తారా లేదా అన్న సంగతిని పక్కన పెడితే ఇప్పటికి అయితే ఓ సీటు ఖాళీ అయింది. అది కూటమిలోని ఏ పార్టీ తీసుకుంటుందన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే విజయసాయిరెడ్డి పూర్తిగా బీజేపీతో మాట్లాడుకుని రాజీనామా చేశారు కాబట్టి ఆ సీటు బీజేపీకే వెళ్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. నాగబాబును రాష్ట్ర మంత్రిని చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి.. ఆయన పేరు రేసులో లేనట్లే. టీడీపీ కూడా ఆ స్థానంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదు. బీజేపీ ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను రాజ్యసభకు పంపితే.. రెడ్డి ఓటు బ్యాంక్ తమ వైపు మరింత ఎక్కువగా ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఒక వేళ ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయనను రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది.
మరోవైపు.. చిరంజీవిని ఎంపిక చేసే విషయంలో కూడా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి ఇస్తే జనసేన కూడా ఫుల్ హ్యాపీ అవుతుందన్న చర్చ బీజేపీలో జరుగుతోందని సమాచారం. ఏపీలో ఎన్నికల నాటి నుంచి చిరంజీవి బీజేపీకి చాలా దగ్గర అవుతున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని అప్పట్లో స్వయంగా వీడియో విడుదల చేశారు మెగాస్టార్. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి కోసం కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దీంతో చిరంజీవి బీజేపీలోకి లోకి ఖాయమన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం రాజ్యసభ సీటు ఖాళీ అయిన నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ పక్కా అన్న చర్చ సాగుతోంది.
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చిరంజీవిని రాజ్యసభ అవకాశం వరిస్తుందా.. లేక కిరణ్ కుమార్ వైపు బీజేపీ మొగ్గుచూపుతుందా.. లేదా మరో కొత్త వ్యక్తికి ఛాన్స్ వస్తుందా అన్న అంశం మరికొద్ది రోజుల్లో తేలనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos