మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. మైనంపల్లి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. మైనంపల్లిపల్లిపై సొంత పార్టీ నేతలు మండి పడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్, కవిత ఖండించారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడటానికి ముందే తన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఇస్తే సరి.. లేదంటే ఊరుకోబోనంటూ సంచలనానికి మైనంపల్లి తెరదీశారు. అంతటితో ఆగక మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బట్టలు ఊడదీసే వరకు నిద్రపోనన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు. ఆయన రాజకీయంగా ఎంతో మందిని అణిచి వేశారని.. అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు. హరీష్ రావు తన నియోజక వర్గాన్ని వదిలేసి మా జిల్లాలో ఎందుకు పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మైనంపల్లిపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
నాకు కుమారుడి భవిష్యత్తే ముఖ్యమని... నా కుమారుడికి టికెట్ ప్రకటించకపోవడానికి హరీష్ రావు కారణమని మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని... నన్ను ఇబ్బంది పెడితే కచ్చితంగా నేనూ బదులిస్తానని... మెదక్, మల్కాజిగిరి కార్యకర్తలే నాకు ముఖ్యమని ఆయన అన్నారు. నేను ఏ పార్టీనీ విమర్శించనని.. పార్టీలకు అతీతంగా ఉంటానని ... మా అబ్బాయికి టికెట్ ఇస్తే.. గెలిపించుకుని వస్తానని మైనంపల్లి స్పష్టం చేశారు.
నాకు మల్కాజిగిరితో పాటు నా కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానని.. లేకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే హరీశ్‌పై పోటీ చేస్తానని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజాసేవ చేశాడన్నారు. హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే తన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. కాగా... మైనంపల్లి 2009లో మెదక్ నుంచి టీడీపీ తరఫున గెలిచారు. అప్పటినుంచి ఆయన చూపు మల్కాజిగిరి వైపే ఉంది. 2014 ఎన్నికల్లో అక్కడినుంచి పోటీకి దిగాలని భావించారు. ఈ ప్రయత్నం ఫలించలేదు. ఎట్టకేలకు బీఆర్ఎస్ లోకి వచ్చాక 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తన పాత నియోజకవర్గం మెదక్ ను కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి వంటి నాయకురాలు ఉండడంతో బీఆర్ఎస్ అధిష్ఠానం మరో మాట లేకుండా మైనంపల్లి ప్రతిపాదనను పక్కన పెట్టింది. దీంతోనే మైనంపల్లి లోలోన రగులుతున్నారు.
కుమారుడికి మెదక్ ఇవ్వకుండా తనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చినా స్వతంత్రంగా బరిలో దిగుతానని మైనంపల్లి స్పష్టం చేశారు. టికెట్ల ప్రకటన సందర్భంగా కేసీఆర్ హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేయడం, మల్కాజిగిరికి మల్లారెడ్డి అల్లుడిని సిద్ధం చేస్తున్నారన్న కథనాలు రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ప్రతిగానే ... నన్ను ఇబ్బంది పెడితే నేనూ బదులిస్తానని మైనంపల్లి వ్యాఖ్యానించినట్లు స్పష్టమవుతోంది. మైనంపల్లి ... తన కుమారుడి టికెట్ విషయంలో తగ్గే అవకాశం లేదని.. ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నడిమాండ్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos