ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో మూడురోజుల పాటు జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాసభలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రముఖులు, కవులు, కళాకారులు, సినీనటులు, రచయితలు, భాషాభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
తొలిరోజు బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. తెలు గు సంస్కృతిని కాపాడుకొని భవిష్యత్తుతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. 2047 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్ కమ్యూనిటీగా తెలుగుజాతి నిలవాలని ఆకాంక్షించారు. తెలుగువారు ఏఐ, డీప్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. అప్పట్లో ఐటీని ప్రోత్సహిస్తే నన్ను అవహేళన చేశారు.. కానీ ఇప్పుడు ఐటీ రంగం అద్భుతంగా పురోగమిస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర కీలకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు.. శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటేనని, అదే తెలుగు జాతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్యకు 1993లో శ్రీకారం చుట్టగా.. తొలి మహా సభలు 1996లో హైదరాబాద్‌లో జరిగాయి. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగడం ఇది రెండో సారి అని తెలిపారు.
నిన్న జరిగిన తొలి రోజు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రచయితలు, కవులు, తెలుగు అభిమానులు హాజరయ్యారు. శనివారం జరుగుతున్న కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఆదివారం ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos