మణిపూర్ లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లతో పార్లమెంట్ దద్ధరిల్లుపోతున్న సంగతీ తెలిసింది. ఈ అంశమే ఇంకా ఇప్పటికీ ఒక కొలిక్కి రాని పరిస్థితుల్లో ఇప్పుడు హర్యానా రాష్ట్రం కూడా మత ఘర్షణలతో తగలబడిపోతున్న అంశం తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని నూహ్, గురుగ్రామ్ జిల్లాలు అల్లర్లతో అట్టుడికిపోతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఐదుగురు చనిపోగా, అందులో ఇద్దరు పోలీసులు ఉన్నారు. మొత్తం 23మంది గాయపడగా, అందులో 10మంది పోలీసులున్నారు. ఈ అల్లర్లలో 120 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పలు హోటళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. విచిత్రంగా... అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాగా... ఇటు హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో రెండుచోట్లా డబుల్ ఇంజిన్ పనిచేయలేక చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. అసలు హర్యానాలో అల్లర్లు ఎందుకు ప్రారంభమయ్యాయంటే... హర్యానాలోని నూహ్ జిల్లాలోని మేవాట్ ప్రాంతంలో ఓ మతానికి సంబంధించిన వారు ర్యాలీ చేస్తుండగా.. మరోవర్గంవారు రాళ్లు విసిరారు. దీంతో గొడవ మొదలు కాగా... అది కాస్త మెల్లగా గురుగ్రామ్ జిల్లాకి వ్యాపించింది. ఈ క్రమంలో పల్వాల్ జిల్లాలో కూడా 25 గుడిసెలకు ఆందోళనకారులు నిప్పంటించడంతో గొడవలు మరింత పెరిగాయి. దీనిపై బీజేపీకి చెందిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ .. తప్పంతా ప్రతిపక్షాలదేనని ... ఈ అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉందని స్టేట్ మెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. హర్యానా అల్లర్లతో ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ ... మేము ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా... ప్రశాంత వాతావరణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos