సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎం.. ఒక ఘటనలో బాధితుడిగా ఉన్న వ్యక్తి కాళ్లు కడిగిన దృశ్యం... ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఆ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ అంశం గురించి కాస్త తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లో ఒక ఆదివాసీపై ఓ వ్యక్తి యూరినేట్ చేసిన వీడియో వైరల్ అయి ... దేశవ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కించింది. ఆ నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ... అప్రమత్తమైన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం... అతన్ని అదుపులోకి తీసుకుంది. ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ... మద్యం మత్తులో, మదమెక్కి రాత్రి సమయంలో, ఫుట్ పాత్ పై ఒంటరిగా కూర్చుని ఉన్న ఒక గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు.
ఈ ఘటన ఆ రాష్ట్రంలోని సిధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో జరిగింది. మూత్రవిసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అతడి అమానవీయ, అమానుష ప్రవర్తనపై అసహ్యం వ్యక్తం చేస్తూ, అతడిని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరుతోంది. ఈ క్రమంలోనే సీఎం చౌహాన్ చేసిన గొప్ప పని అందర్నీ ఆశ్చర్యగొలిపేలా చేస్తోంది. ఈ ఘటనలో బాధితున్ని... శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లోని తన నివాసానికి స్వయంగా ఆహ్వానించారు. బాధితుడు వచ్చీ రాగానే ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు కడిగారు.
ఈ సందర్భంగా సీఎం చౌహాన్.... బాధితుడితో మాట్లాడుతూ... ‘ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి నీ పట్ల దారుణంగా వ్యవహరించిన ఆ వీడియో చూసి నాకు చాలా బాధగా అనిపించిందని... నన్ను క్షమించండని... ప్రజలే నాకు దేవుళ్లతో సమానం’ అని అన్నారు. కాళ్లు కడిగిన తరువాత ఆయనకు పూల మాల వేసి గౌరవించారు. ఆ తరవాత శాలువా కప్పారు. చాలాసేపు పక్కనే కూర్చుని మాట్లాడారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కాగా... ప్రవేశ్ శుక్లా చేసిన దురాగాతంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తూ... ఆదివాసీలపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదే నంటూ చురకలు అంటించింది. మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ కావడంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా ... బుల్‌డోజర్‌తో అతని ఇంటిని కూడా కూల్చేశారు. ఆ తరువాత... అది అక్రమ నిర్మాణమని వివరణ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ... సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చిత్తశుద్ధిని .. నెటిజన్లు మరియు సిటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఇదండీ సంగతి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos