అమరావతి 16: భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్టు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం అన్ని పీపీపీ ప్రాజెక్టులనూ సస్టెయినబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని... ప్రతీ ప్రాజెక్టు వద్దా ఆర్ధిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్ధంగా వినియోగించుకోవాలని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్ధంగా నడిపేందుకు అవసరమైన మెకానిజమ్ సిద్ధం చేయాలని సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను కూడా భాగస్వాములను చేసి వారికి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద పబ్లిక్ టచ్ పాయింట్ల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్ధిక కార్యకలాపాలకు అవకాశాలు కల్పించాలన్నారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు రూ.178 కోట్ల వీజీఎఫ్‌ను కేంద్రం ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్ కాలేజీలకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని.. ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్ధిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు.
వచ్చే కేబినెట్‌కు నూతన విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం-వీజీఎఫ్ పాలసీ 1.0 ను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు విధానాలను కూడా అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ప్రతీ ఏటా పీపీపీ కింద రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావొచ్చని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం స్వర్ణాంధ్ర విజన్ మైక్రో, మ్యాక్రో లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని... సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయన్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ ఫైనాన్షియల్ ప్లాన్ ను తయారు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు పెట్టుబడిదారుల నుంచి విశ్వాసాన్ని కలిగించేలా పీపీపీ ప్రాజెక్టులను చేపట్టాలని సీఎం సూచించారు. ఏ రంగమైనా ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజి రావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ఆస్తుల సద్వినియోగం
ప్రభుత్వం వద్ద నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంప్డ్ స్టోరేజీ, సౌరవిద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గనులు, నెడ్ క్యాప్, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉన్న విద్యార్ధుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని.. పట్టణ ప్రాంతాల్లో రహదారులకు సమీపంలోనే మినీ టౌన్‌షిప్‌లా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ చదివేలా వీరిని తీర్చి దిద్దాలని అన్నారు. ఈ సమీక్షకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, వి.వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఐఅండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos