ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు ఎంపీ సీటు విషయం ఆ జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా గరంగరం గా మారింది. వైసీపీ ని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడి పోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఇప్పటికే సెట్టింగ్ ఎంపీలైన డాక్టర్ సంజయ్ కుమార్ , బాలశౌరి బయటికి రాగా నిన్న గాక మొన్న లావు కృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసిపిని వీడిన ఎంపీల సంఖ్య మూడుకు చేరుకున్నట్లు అయింది. ఈ క్రమంలో పార్టీని వీడే వారిలో ఇప్పుడు తాజాగా మరొక పేరు వినిపిస్తోంది. నిన్న వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఇంటి స్థలాలకు నిధులు మంజూరు చేయించుకుని తాడేపల్లి నుంచి తిరిగొచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని ... ఆ తర్వాత తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఎన్నికల బరిలో దిగుతాడని వెల్లడించారు. అటు, ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ లభించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సీటు విషయమై బాలినేని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని చెప్పానని.. మాగుంట సీటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. బాలినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైఎస్సార్‌సీపీకి దాదాపుగా టికెట్ లేనట్లేనని చర్చ జరుగుతోంది. అయితే బాలినేని మాత్రం పదే, పదే మాగుంట ప్రస్తావన తెచ్చారు. దీంతో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి విషయంలో 2014 సీన్ రిపీట్ అవుతుందా... ఆయన మళ్లీ పార్టీ మారక తప్పదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీలో టికెట్ లేదన్న సంకేతాలు వస్తుండటంతో మాగుంట టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఒంగోలులో వైసీపీ నుంచి పార్లమెంటుకు అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట - బాలినేని కాంబినేషన్ కు బ్రేక్ పడనున్నట్లు సీన్ కనిపిస్తోంది. టీడీపీ నుంచి మాగుంటకు సానుకూల సంకేతాలు ఉన్నాయని... ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని టిడిపి అధిష్టానం నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మాగుంట ఏ క్షణంలో నైనా వైసీపీ నుంచి జంప్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos