27 నెలలుగా జీతం రావడం లేదన్న మనస్తాపం ఓపక్క.. అధికారుల వేధింపులు మరోపక్క.. వీటిని తాళలేక ఓ వాటర్ మ్యాన్ తాను పనిచేస్తున్న పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటకలోని హొంగనూరు గ్రామ పంచాయతీలో 2016 నుంచి వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్న చికూస నాయక అనే వ్యక్తి .. తనకు రావాల్సిన జీతాల కోసం ఏళ్లుగా పోరాడుతున్నాడు. తన ఆవేదనను వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్‌లో పలు కీలక విషయాలను వెల్లడించాడు. "నాకు 27 నెలలుగా జీతం రాలేదు. ఈ విషయంపై పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ), గ్రామ పంచాయతీ అధ్యక్షురాలికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. చివరికి జిల్లా పంచాయతీ సీఈఓను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని" ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక పీడీఓ రామే గౌడ, పంచాయతీ అధ్యక్షురాలి భర్త మోహన్ కుమార్ తనను మానసికంగా తీవ్రంగా వేధించారని చికూస నాయక ఆరోపించాడు. "సెలవు అడిగితే నా స్థానంలో వేరే వ్యక్తిని చూపించి వెళ్లమనేవారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులోనే ఉండమని బలవంతం చేసేవారు. వారి వేధింపుల వల్లే నేను చనిపోతున్నాను. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని" సూసైడ్ నోట్‌లో కోరాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా పీడీఓ, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు, ఆమె భర్తపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా పంచాయతీ సీఈఓ స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీడీఓ రామే గౌడను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనపై కర్ణాటక బీజేపీ... సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించింది. "కాంగ్రెస్ ప్రభుత్వ 'ఆత్మహత్యల భాగ్యం'లో మరో ప్రభుత్వ ఉద్యోగి బలి అయ్యాడు. రెండు రోజుల క్రితమే కలబురగిలో జీతం రాలేదని ఓ లైబ్రేరియన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటన మరువక ముందే మరో నిరుపేద ప్రాణం పోయిందని" బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడింది. "సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. నెలకు కేవలం రూ. 5,000 సంపాదించే ఓ పేద ఉద్యోగికి రెండేళ్లుగా జీతం ఇవ్వకపోవడంతో అతను చనిపోయేలా చేశారు. మీ ప్రభుత్వానికి కనీసం హృదయం, మానవత్వం లేదా.. మీ అసమర్థ పాలనకు ఇంకా ఎంతమంది ఉద్యోగులు, కాంట్రాక్టర్లు బలికావాలని" బీజేపీ ప్రశ్నించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos