ఏపీలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇవాళ అమరావతిలో పర్యటిస్తున్నారు. ముందుగా సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన.. అనంతరం సచివాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్)కు ఆయన్ను తీసుకెళ్లారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు.ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం ఆయనకు వెల్లడించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని గేట్స్ చంద్రబాబును ప్రశంసించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు.కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఆయనకు సీఎం వివరించారు.

ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా...బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని వివరించారు. క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో భూ రికార్డులు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే పన్నుల వసూలు ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ ప్రశంసించారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు, బీపీ, డయాబెటీస్ పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని గేట్స్ అడిగారు. అనంతరం కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు బాగుందని గేట్స్ ప్రశంసించారు.

ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు అధికారులు ఆయనకు వివరించారు. అలాగే ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. దీంతో గ్రేట్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ తెలిపారు. అనంతరం అమరావతి నిర్మాణ వివరాలు తెలుసుకున్న బిల్ గేట్స్...రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు.

Related Videos