నిడదవోలు : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు జాతికి ప్రత్యేకించి మహిళలకు ద్రోహం, అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు  వ్యాఖ్యానించారు. ఈ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలతో కలిసి సీఎం ఈ నిరసన ర్యాలీలో ప్లకార్డులు చేతపట్టుకుని నడిచారు. మహిళా బిల్లును అడ్డుకున్న రోజును ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు మహిళా ద్రోహులని పేర్కొన్నారు. మహిళా సమాజానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల్ని ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సీఎం అన్నారు. మూడు దశాబ్దాల మహిళా రిజర్వేషన్ కలను ప్రతిపక్ష పార్టీలు చెరిపేశాయని పేర్కొన్న ముఖ్యమంత్రి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం మహిళలకు ద్రోహం చేయడమేనని అన్నారు. ఎన్డీఏ పక్షాలతో కలిసి నిరసన ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ .." భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని సుదీర్ఘ కల సాకారం అవుతుందని భావించాం. పార్లమెంటు, అసెంబ్లీలోనూ 33 శాతం  మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాం. మహిళల్ని గౌరవించటం భారత సంస్కృతి లో భాగం. నిన్న పార్లమెంటులో దీనికి భిన్నంగా జరిగింది. విపక్షాల వైఖరికి నిడదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ నిర్వహించాం.మహిళలంతా బయటకు వచ్చి వారికి నిరసన తెలియాలని పిలుపు ఇస్తున్నాను. దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోం మంత్రి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50 శాతం మేర సీట్లు పెరుగుతాయి.  ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం.దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా.?" అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 

విద్రోహంపై ఇంటింటికీ ప్రచారం.. 

"నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమే. దీనిపై పవన్ కల్యాణ్‌నూతో మాట్లాడాను. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా? 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకు రాలేక పోయారు. 2029లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే సవరణ బిల్లు తీసుకు వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ ఈ బిల్లుకు 2/3 మంది సభ్యుల మద్దతు రాకుండా అడ్డుకున్నాయి. దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు ఆన్యాయం జరుగుతుందని ఏవోవో ఆరోపణలు సాకులు చెప్పారు. లేని పోని సాకులతో బిల్లును డిఫీట్ చేయటం శోచనీయం. ప్రజలు ఎన్నుకుంటేనే చట్టసభల్లోకి వచ్చిన వారు మహిళలకు ద్రోహం చేయటం సరికాదు. జనాభాలో సగం ఉన్న మహిళలు ఏ రంగంలో అయినా సమర్ధంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు తీసుకువచ్చారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని మహిళల్ని  ఆ పార్టీలు ఓట్లు అడుగుతాయి.?  ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలి. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతీ ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం". అని ముఖ్యమంత్రి అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: బొత్స కన్నీళ్ల పై..Minister Payyavula Keshav Sensational Press Meet | AP Politics | YSRCP | AG

తాజా వార్తలు

Related Videos