ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెను సందర్శించారు. కుటుంబపరమైన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు గ్రామానికి విచ్చేశారు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి సందర్భంగా నేడు సంవత్సరీకం కార్యక్రమాన్ని నిర్వహించారు. నారావారిపల్లెలోని వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామ్మూర్తినాయుడు తనయుడు, నటుడు నారా రోహిత్ సంవత్సరీకం క్రతువు నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా తన బాబాయి దివంగత నారా రామ్మూర్తినాయుడికి నివాళులర్పించారు. అనంతరం, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గ్రామంలోని రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తన బాబాయిని స్మరించుకుంటూ కొంతసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా హాజరై దివంగత రామ్మూర్తినాయుడికి నివాళులర్పించారు.
కాగా ఈ కుటుంబ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలను మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, నారా రోహిత్‌తో పాటు ఇతర బంధువులు కూడా ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos