అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని సీఎం వ్యాఖ్యానించారు. ఖనిజాల వ్యాల్యూ అడిషన్ కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏమేరకు ఉన్నాయన్న దానిని గుర్తించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని సీఎం అన్నారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని మిగతా బ్లాక్స్ పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలిచ్చారు.
టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం..
రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాల, సరఫరా పై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించటంతో పాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసమే ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ సాయి ప్రసాద్, గనుల శాఖ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, పీయుష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos