కొచ్చి (కేరళ): యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం ఉద్యోగాల కల్పన. అందుకే మా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి నుంచి చివరి స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఉద్యోగాల సృష్టిపైనే పనిచేస్తున్నారు. యువత కలల సాకారం కోసమే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం నిర్ణయించామని ఏపీ విద్య,ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ అఢిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. డీఎస్సీపై రాజకీయ నిరుద్యోగులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, వాస్తవానికి వారు ఆరోపిస్తున్న స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో జారీచేసినవేనన్నారు. క్వాంటమ్ అనేది ఊహ కాదు, నెక్ట్స్ జెనరేషన్ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ దాన్ని అందిపుచ్చుకుంది. తొలి 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాం. దానిపై పరిశోధనలు, మెటీరియల్ సైన్స్, క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి రంగాల్లో పని చేసి క్వాంటమ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనుకుంటున్నామని చెప్పారు. తాను క్రికెట్ చూడటానికి వెళ్లినపుడు కూడా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి పెట్టుబడులు రాబట్టినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ -2026లో
రాజ్ దీప్ ప్రశ్నలు – మంత్రి లోకేష్ సమాధానాలు
రాజ్ దీప్ సర్దేశాయ్:
ఎలక్షన్ కమిషన్ విషయంలో టీడీపీ వైఖరి ఏంటి? ఎన్నికల సంఘంపై వివాదం మొదలైన వెంటనే మీ లోక్‌సభ నేత కూడా పారదర్శకత కోసం ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు పరిస్థితి అంతా సర్దుకున్నట్లుగా కన్పిస్తోంది, టీడీపీకి ఎన్నికల సంఘంతో ఎలాంటి సమస్య లేనట్టుగా ఉంది. అసలు టీడీపీ వైఖరి ఏమిటి? ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్లుగా జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని మీరు భావిస్తున్నారా?
నారా లోకేష్ : వ్యవస్థను ప్రశ్నించే వారికి కొంత బాధ్యత కూడా ఉండాలన్నది నా అభిప్రాయం. ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలు S.I.R. గురించి ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ కూడా ఒక రాజకీయ పార్టీగా S.I.R.కు సంబంధించిన వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు వివరణలు కోరింది. నిజానికి దాదాపు ఏడాది క్రితమే మేము అనేక అంశాలపై వివరణ కోరాం. ఎందుకంటే మేము కూడా మా రాష్ట్రంలో S.I.R. ప్రక్రియను ఎదుర్కొన్నాం. వ్యవస్థ పూర్తిగా పరిపూర్ణమా అంటే ఖచ్చితంగా కాదు. ఏ వ్యవస్థలోనైనా మెరుగుపరచాల్సిన అంశాలు ఉంటాయి. అయితే దాన్ని మెరుగుపరచాలనే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను టీడీపీ పరిశీలించింది. అది సక్రమంగానే ఉందని మేము భావిస్తున్నాం. ఇక ముందు కూడా ఈ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి మావంతు సలహాలు, సూచనలు ఇస్తాం. కొంతమంది ఓటర్లు మరణించడం, కొంతమంది నివాసాలు మార్చుకోవడం వల్ల కొన్ని అనుమానాలకు, సందేహాలకు అవకాశం ఉండొచ్చు. కానీ మేము మా రాష్ట్రంలో ఈ ప్రక్రియను ఎదుర్కొన్నాం. మా పార్టీ 92 శాతం ఓట్లను మ్యాప్ చేసింది. ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లతో కలిసి ఓటర్ల మ్యాపింగ్ చేస్తుంది. మేము అవసరమైన పత్రాలను సమర్పించాం. ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : రాహుల్ గాంధీ చెబుతున్నట్లుగా ఎన్నికల సంఘం బీజేపీ లేదా NDA నాయకత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోందన్న వాదన మీరు అంగీకరించరా? బీజేపీ ప్రతి ఎన్నికలో గెలిచేలా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించారని ఆయన ఆరోపిస్తున్నారు.
నారా లోకేష్ : అలా వ్యవస్థను మార్చి ఉంటే కేరళలో బిజెపి ఎందుకు ఓడిపోయింది? తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది? పార్లమెంట్ ఎన్నికలను చూస్తే అనేక రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. కేరళలో కూడా పరిస్థితి భిన్నంగా ఉంది. కాబట్టి రాజకీయంగా ఓడిపోయినప్పుడు ఎన్నికల సంఘాన్ని నిందించడం సులభం. గెలిచినప్పుడు మాత్రం గెలుపునకు అనేక కారణాలు చెబుతారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఓటర్ల జాబితాలో ఉండటం చాలా ముఖ్యం. ఒక రాజకీయ పార్టీగా మేము ఓటర్ల జాబితా ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. మేము వాస్తవాలు, డేటా ఆధారంగానే మాట్లాడతాం. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మేము మా అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేశాం. ఎన్నికల సంఘాన్ని అనేకసార్లు కలిశాం. S.I.R. ఒక నిర్దిష్ట విధానంలో జరగాలని మా అభిప్రాయాన్ని చెప్పాం. మా సూచనలు వారి ముందున్నాయి. మా అభిప్రాయం ఎక్కడా మారలేదు.
రాజ్ దీప్ సర్దేశాయ్ : ఇప్పుడు Gen Z గురించి, యువ భారతంలో కనిపిస్తున్న అసంతృప్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి?
నారా లోకేష్ : ప్రస్తుతం భారతదేశంలో ఒక కొత్త ఉద్యమం వస్తోందని నేను భావిస్తున్నాను. దీనికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. ఇది జనరేషన్ ఆధారిత మార్పు. వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్న యువత ఒక వర్గంగా ఏర్పాటై ఉద్యమిస్తోంది. మా ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సమస్యలను గుర్తించాం. మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకున్నాం. యువతతో కలిసి వాటికి పరిష్కారాలు కనుగొనడం నాకు చాలా ఉత్సాహాన్నిస్తుంది. యువత కోరుతున్నది – జాబ్స్..జాబ్స్..జాబ్స్.
రాజ్ దీప్ సర్దేశాయ్ : 2024 ఎన్నికలకు ముందు యువతకు అనేక హామీలు ఇచ్చారు. యువత ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల సమస్యను పరిష్కరించేందుకు మీరు ఏం చేస్తున్నారు? విద్యాశాఖ మంత్రిగా ‘క్యాంటీన్ పే చర్చ’ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాలేజీలకు వెళ్తున్నారు. యువత మీతో ఏం చెబుతోంది?
నారా లోకేష్: ఈరోజు యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం మరిన్ని ఉద్యోగాలు కల్పించండి. అందుకే మా ప్రభుత్వం కూడా ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండా పెట్టుకుంది. ముఖ్యమంత్రి నుంచి చివరి స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఉద్యోగాల సృష్టిపైనే పనిచేస్తున్నారు. యువత కలల సాకారం కోసమే 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం నిర్ణయించాం. ఉద్యోగాల సమస్యకు పరిష్కారం విద్యతో ప్రారంభమవుతుంది. మేము విద్యా పాఠ్యాంశాలను పూర్తిగా పునఃపరిశీలిస్తున్నాం. పరిశ్రమలతో కలిసి ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. గత ఏడాది కాలంలో భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. ఇదే మమ్మల్ని ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. కొత్తగా ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. LG, Premier Energy వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంచుతున్నాం. హార్టికల్చర్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రతి రంగానికి ప్రత్యేక క్లస్టర్, మిషన్, ఫోకస్ ఉండాలి. మేము అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. Skyroot వంటి సంస్థలు ఎక్కువ మందికి తెలియకముందే మేము వారిని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నించాం. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, కంపెనీలను వెతికి, వెంటపడి, పూర్తి ఎకోసిస్టమ్ నిర్మించేలా చేస్తున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షల విషయంలో ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. దేశంలో పరీక్షల నిర్వహణ విధానాన్ని పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉందా? ఇటీవల డీఎస్సీపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి?
నారా లోకేష్ : రాజకీయ నిరుద్యోగులే డీఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో DSC పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఒక్క ఆరోపణ కూడా ఇప్పటివరకు నిరూపించలేదు. గత ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఎంపికైన విద్యార్థులకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే అంశంపై ఆరోపణలు చేస్తున్నారు. క్రీడా కోటా అంశంపై వారు కోర్టుకు వెళ్లారు, CBI దర్యాప్తు కోరారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు, కోర్టు ఏ ఆదేశం ఇచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : దేశంలోని విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా?
నారా లోకేష్ : ఖచ్చితంగా. నేను మీతో ఏకీభవిస్తున్నాను. విద్యా వ్యవస్థ నిన్నటి అవసరాలకు కాకుండా రేపటి అవసరాలకు అనుగుణంగా మారాలి. ఇది నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. 16వేల మంది టీచర్లను అత్యంత పారదర్శకమైన విధానంలో నియమించాం. ఇప్పుడు ప్రతి విద్యార్థికి సంబంధించిన డేటా మా వద్ద ఉంది. పిల్లలు చదువు మధ్యలో మానేయకుండా చూసేందుకు ఈ డేటాను ఉపయోగిస్తున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : గ్రామీణ ప్రాంతాల్లో చదివే పిల్లలను AI ఆధారిత ప్రపంచానికి ఎలా సిద్ధం చేస్తారు?
నారా లోకేష్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన— ప్రతి కుటుంబం AIని ఉపయోగించేవారిగా ఉండాలి లేదా AIకి సంబంధించి ఒక ఉపయోగకరమైన వినియోగం ఉండాలి. విద్యాశాఖ ద్వారా AI నుంచి క్వాంటమ్ వరకు భవిష్యత్ టెక్నాలజీలపై విద్యార్థులకు పరిచయం కల్పిస్తున్నాం. కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు కొత్త టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్నాం. అయితే ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. విద్యా వ్యవస్థను సంస్కరించడానికి కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుంది.
రాజ్ దీప్ సర్దేశాయ్: ప్రజాప్రతినిధులు కాలేజీలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడటం సరైన మార్గమని భావిస్తున్నారా?
నారా లోకేష్ : ప్రతి ప్రభుత్వం యువత మనోభావాలను వినాలి. ఆంధ్రప్రదేశ్‌లో మేము అదే చేస్తున్నాం. నేను కూడా ఎలాంటి అజెండా లేకుండా కాలేజీలకు వెళ్తాను. విద్యార్థులతో ఓపెన్‌గా మాట్లాడుతాను. ఇటీవల నర్సరావుపేటలో విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులు కావాలని అడిగారు. వారికోసం IBMతో మాట్లాడి వారికి క్యాప్సూల్ కోర్సులు తీసుకొచ్చాం. వాటికి క్రెడిట్ కూడా లభిస్తుంది. యువత చెప్పేది వినడం ద్వారా మంచి ఆలోచనలు వస్తాయి.
రాజ్ దీప్ సర్దేశాయ్ : అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చాలన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కలగానే మిగులుతుందా? వాస్తవ రూపం దాల్చుతుందా?
నారా లోకేష్ : హైదరాబాద్‌లో IT గురించి చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఇలాగే ప్రశ్నించారు. బెంగళూరు ఇప్పటికే చాలా ముందుంది అన్నారు. కానీ ఒక నాయకుడి దార్శనికత ఒక ఆర్థిక వ్యవస్థను మార్చగలదు. ఒక్క చొరవ మొత్తం నగర భవిష్యత్తును మార్చేసింది. క్వాంటమ్ అనేది ఊహ కాదు. ఇది నెక్ట్స్ జెనరేషన్ టెక్నాలజీ. భారతదేశానికి క్వాంటమ్ మెషీన్ వచ్చింది. కానీ ఏ రాష్ట్రం దాన్ని తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ దాన్ని అందిపుచ్చుకుంది. తొలి 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాం. దానిపై పరిశోధనలు, మెటీరియల్ సైన్స్, క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి రంగాల్లో పని చేసి క్వాంటమ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనుకుంటున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి పెట్టుబడులు రావడానికి మీరు ఏం కొత్తగా అందిస్తున్నారు?
నారా లోకేష్ : పెట్టుబడుల కోసం మేం 3S మంత్రాన్ని అనుసరిస్తున్నాం. అదే స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రాజెక్ట్ ప్రతిపాదనలను క్లియర్ చేసే వేగంలో ఏపీ కొత్త ప్రమాణాలను పాటిస్తోంది. రెండోది సర్వీస్. పెట్టుబడిదారులకు వారి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్‌ను ERP వ్యవస్థ ద్వారా సమీక్షిస్తున్నాం. మూడవది స్టెబిలిటీ. ప్రభుత్వాలు మారితే పాలసీలు కొనసాగుతాయా అనేది పెట్టుబడిదారులకు ఉన్న సందేహం. అందుకే స్థిరమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక వనరుల విషయంలో భవిష్యత్తు సవాళ్లను ఆలోచించారా? లేక పెట్టుబడులు రావాలనే తొందరలో ముందుకు వెళ్తున్నారా?
నారా లోకేష్ : మేము తొందరలో ఉన్నామా అంటే ఖచ్చితంగా ఉన్నాం. మన దగ్గర ఐదేళ్ల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుత తరం మార్పును చూడాలనుకుంటోంది. యువత కూడా తొందరలో ఉంది. వారు త్వరగా ఫలితాలు చూడాలనుకుంటున్నారు. వేగం మా ప్రధాన లక్షణం. అదే సమయంలో క్లస్టర్ ఆధారిత విధానంతో ముందుకు వెళ్తున్నాం. నీటి, విద్యుత్ అవసరాలను ముందుగానే ప్రణాళిక చేస్తున్నాం. గూగుల్ తో సహా చాలా డేటా సెంటర్లు ఎయిర్-కూల్డ్ డేటా సెంటర్లుగా ఉంటాయి. అవి వినియోగించే నీటి పరిమాణం ఐటీ సెంటర్ ఉపయోగించే నీటితో సమానంగా ఉంటుంది. అందువల్ల మేము దీనికి ప్రణాళిక చేస్తున్నాం. మేం కేవలం డాటా సెంటర్లపై మాత్రమే దృష్టిపెట్టడంలేదు. దేశీయ ఐటీ కంపెనీలతో పాటు స్టీల్, సిమెంట్, ఆక్వా, ఫార్మా, మెడికల్ డివైసెస్ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. వ్యవసాయం నుంచి క్వాంటమ్ వరకు 23 క్లస్టర్లలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్లస్టర్‌ను నిర్మించడానికి అవసరమైన అన్ని రంగాలను తీసుకురావాలి. ఎండ్-టు-ఎండ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలి.
రాజ్ దీప్ సర్దేశాయ్ : మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. గత రెండేళ్లలో విద్యా రంగంలో ఏం జరిగింది?
నారా లోకేష్ : నేను స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేశాను. అందుకే విద్యాశాఖను ఎంచుకున్నాను. సమాజానికి పెద్ద స్థాయిలో తిరిగి సేవ చేయగలనని భావించి విద్యాశాఖను ఎంచుకున్నాను. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లారని గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో 1.10లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి వచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నిర్ణయాల్లో ఒకటి ఉపాధ్యాయుల నియామకం. 16వేల మంది ఉపాధ్యాయులను నియమించి, శిక్షణ ఇచ్చి, పాఠశాలల్లో నియమించాం. మా ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గత ఏడాది మా పనితీరు మెరుగ్గా ఉంది. ఇప్పుడు గత పనితీరు నుంచి అత్యుత్తమ స్థాయికి వెళ్లాలి. ఆ దిశగా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏమిటి? ఇది కేవలం మంచి మార్కెటింగ్ పేరా?
నారా లోకేష్ : రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక శాఖ. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే డేటాను ఒకచోట సమీకరించి ఒక డేటా లేయర్‌ను రూపొందిస్తాం. ఆ తర్వాత అవసరమైన అంశాలపై సంబంధిత మంత్రులు, శాఖలకు సూచనలు, అలర్ట్‌లు, అడ్వైజరీ నోట్స్ ఇస్తాం. విద్యుత్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మందులు ఉన్నాయా అనే అంశం వరకు డేటాను విశ్లేషిస్తాం. అదే మమ్మల్ని ఇతర రాష్ట్రాల నుంచి భిన్నంగా నిలబెడుతోంది.
రాజ్ దీప్ సర్దేశాయ్ : రైతులకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఎలా ఉపయోగపడుతుంది?
నారా లోకేష్ : ఇందుకు నీటి నిర్వహణ ఒక మంచి ఉదాహరణ. గోదావరి, కృష్ణా నదుల నుంచి వాతావరణ అంచనాల ఆధారంగా నీటిని ఎలా తరలించాలి? నష్టాలను ఎలా తగ్గించాలి? అనే అంశాల్లో డేటా ఉపయోగపడుతుంది. వాతావరణ అంచనాల ఆధారంగా రైతులకు ఎప్పుడు విత్తాలి, ఏ పంటలు వేయాలి అనే సూచనలు ఇవ్వవచ్చు. ఎల్‌నినో వస్తే విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. దానికి ముందుగానే సిద్ధం కావాలి.
మేము కూడా ఒక శాఖగా నేర్చుకుంటున్నాం. విద్యుత్ ప్రణాళిక విషయంలో మేము ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాం. ఎనర్జీ ప్లానింగ్‌లో ఇంకా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆ దిశగా పనిచేస్తున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : దేశంలోని అనేక రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ 18 ప్రధాన రాష్ట్రాల్లో 17వ స్థానంలో ఉంది. ఎన్నికల హామీ పథకాలు, ఇతర ఖర్చుల వల్ల ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి ఉందా?
నారా లోకేష్ : రాష్ట్రాలకు ఇది ఒక సవాలే. కానీ మరో వైపు కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. మా జీఎస్టీ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉంది. 17–18 శాతానికి పైగా ఉంది. దీర్ఘకాలంలో మా అప్పులను తీర్చగలమనే నమ్మకం ఉంది.
ఓటింగ్ విధానం కేవలం ఎన్నికల హామీల ఆధారంగా మారుతున్నట్లయితే రాజకీయ నాయకులను మాత్రమే ఎందుకు నిందించాలి? ప్రజలు కూడా బాధ్యత వహించాలి. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడిన తర్వాత ఇక సంక్షేమం అవసరం లేని స్థాయికి రావాలి. వారికి ఉద్యోగాలు ఉండాలి. వారు తమ కుటుంబాలను తాము నిర్వహించుకోగలగాలి. అలాంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : దక్షిణాది రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నాయి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళనపై మీరు ఏమంటారు?
నారా లోకేష్ : ఇది చాలా ముఖ్యమైన అంశం. డీలిమిటేషన్ విషయంలో మేము స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉన్న ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలి. ప్రాతినిధ్యాన్ని తగ్గించకూడదనేది తెలుగుదేశం పార్టీ వైఖరి. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందనే అంశంపై మేము ఆందోళన వ్యక్తం చేశాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : రాష్ట్రాలన్నింటిలో 50 శాతం ప్రాతినిధ్యం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటే మీరు మద్దతు ఇస్తారా?
నారా లోకేష్ : మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇది మాకు కొత్త విషయం కాదు. 40 ఏళ్ల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నాం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇద్దరికి మించి పిల్లలను కనాలని ఇటీవల చెప్పారు. ఇది గతంలో ఉన్న “హమ్ దో, హమారే దో” ఆలోచనకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎందుకు?
నారా లోకేష్ :
జనాభా నిర్వహణ అనేది జపాన్, సింగపూర్ వంటి దేశాలు ఇప్పటికే ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. భారతదేశాన్ని ఒకే దేశంగా మాత్రమే చూడకూడదు. ఉత్తర భారతదేశంలో జనాభా పునరుత్పత్తి రేటు ఒక స్థాయిలో ఉంది. దక్షిణ భారతదేశంలో మరో స్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ రీప్లేస్‌మెంట్ రేట్‌ను 2.1 వద్ద కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 1.5 వద్ద ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఇప్పుడు మాత్రమే మాట్లాడటం లేదు. 2019 నుంచే దీనిపై మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో అత్యంత ముఖ్యమైన అంశంగా మారబోయే విషయంపై దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అదే సమయంలో విద్య నాణ్యతను మెరుగుపరచడం, ఉద్యోగాలు కల్పించడం కూడా ముఖ్యమే.
రాజ్ దీప్ సర్దేశాయ్ : 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం ఏమిటి?
నారా లోకేష్ : ఇది మంత్రిగా నా రెండో టర్మ్. నేను నేర్చుకున్నది — అపారమైన సహనంతో వినాలి. అన్నివర్గాల వద్దనుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. ఒక వ్యవస్థను సరిచేయాలనుకుంటే ఎప్పుడూ కొన్ని అంశాల్లో మెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఇదే నేను నేర్చుకున్న ప్రధాన పాఠం.
రాజ్ దీప్ సర్దేశాయ్ : మీరు మీ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. మీకు కుటుంబం కూడా ఉంది. ఇంత సమయం ఎలా కేటాయిస్తారు?
నారా లోకేష్ : ఇది నాకు సులభమైన విషయం కాదు. కానీ నా భార్య నాకు ఎంతో మద్దతు ఇస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. ఆమె మద్దతు వల్లే నేను నా పని చేయగలుగుతున్నాను. మై టీడీపీ యాప్ ద్వారా నా సహచరుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ వస్తుంది.
రాజ్ దీప్ సర్దేశాయ్ : మీరు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఎన్టీఆర్ గారి మనవడు. ఈ వారసత్వం మీపై ఎప్పుడూ ఒక ఒత్తిడిగా ఉంటుందా? మీరు నిరంతరం మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి వస్తుందా?
నారా లోకేష్ : నేను ఎప్పుడూ ఉన్నత పదవులను ఆశించలేదు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నా ప్రాధాన్యత కాదు. విద్యా వ్యవస్థను వీలైనంత త్వరగా మార్చడమే ఇప్పుడు నా ప్రాధాన్యత. అదే నన్ను ప్రతిరోజూ ముందుకు నడిపిస్తుంది. పరీక్షలు జరుగుతున్నప్పుడు మొత్తం బృందం అప్రమత్తంగా ఉంటుంది. ఎలాంటి తప్పులు జరగకుండా పర్యవేక్షిస్తాం. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు. అందుకే నేను ప్రతిరోజూ దానిపైనే దృష్టి పెడతాను.
రాజ్ దీప్ సర్దేశాయ్ : పొలిటికల్ బిజీ షెడ్యూళ్ల వల్ల సాధారణ జీవితం, క్రీడలు వంటివి మిస్ అవుతారా?
నారా లోకేష్ : ఇదే నా జీవితం. నేను చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్నాను. నేను ఏదీ మార్చుకోవాలని అనుకోవడం లేదు. నేను ఎప్పుడూ “ఏబీసీ — ఆల్వేస్ బీ క్లోజింగ్” అని నమ్ముతాను. ఎప్పుడూ ఒక అవకాశాన్ని ముగింపునకు తీసుకెళ్లాలి. నేను క్రికెట్ మ్యాచ్‌కు వెళ్తాను. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టుబడి ఒప్పందాన్ని ముగిస్తాను. ఒక టీ20 మ్యాచ్‌లో నేను ఎంతమంది పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను కలిశానో మీరు ఆశ్చర్యపోతారు. వారిలో చాలామంది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టారు. అందుకే ఏబీసీ — ఆల్వేస్ బీ క్లోజింగ్.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos