అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే... వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలి. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే... వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్దతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఆర్ అండ్ బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలి. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలి. రహదారి నిర్వహణకు ప్రామాణికతను నిర్దేశించాలి. స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రీడ్ మోడల్ లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుంది. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్‌తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయాలి. దీనిపై యూనివర్శిటీల్లో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలి. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా పనులు చేపట్టాలి. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలి. దీని కోసం సాస్కీ నిధులను వినియోగించుకోవాలి. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని’ అని సీఎం సూచించారు.
పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యత..
"రాష్ట్రంలోని పోర్టులను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయి. పోర్టులను కనెక్ట్ చేసేలా పశ్చిమ భారతంలో గుజరాత్ మోడల్ అలానే ఉంది. తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడార్ గా జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఈ రకమైన కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి. లాజిస్టిక్స్ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసేలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. దీని నిమిత్తం ఏపీ లింక్ ద్వారా ఆర్ధిక వనరుల్ని సమకూరేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. మౌలిక సదుపాయాల ద్వారా సామాన్యుడికి సౌకర్యాలు పెరగాలి, ఇదే సమయంలో ఆర్ధిక లావాదేవీలు జరగాలి. ప్రభుత్వం ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. అత్యుత్తమ ఫలితాలు రావాలి. ప్రస్తుతం 73 శాతం కార్గో రోడ్ రవాణ ద్వారానే వెళ్తోంది. రైల్వే ద్వారా వెళ్లే కార్గో వ్యయం తక్కువగా ఉన్నట్టే రహదారుల కార్గో వ్యయం కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల మధ్యనున్న ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఆయా పోర్టులను అనుసంధానం చేసే సమయంలో ఆయా పోర్టులకు సమీపంలోని పొరుగు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకుని వెళ్లేలా ప్రధాన రహదారులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. రహదారుల నిర్మాణం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. జాతీయ రహదారులకు సమీపంలో ఉండే ప్రాంతాల అభివృద్ధి జరగాలి. జాతీయ రహదారులతో పాటు దేశ నిర్మాణం జరగాలి. ఏపీ పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా మారుతోంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు కనెక్టు చేసేలా రహదారులు రావాలి. వివిధ నగరాలకు రింగ్ రోడ్లు వస్తే ఆయా ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలు విస్తృతం అవుతాయి. పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను ఏపీని కనెక్టు చేసేలా రహదారుల నిర్మాణం జరగాలి. ఖరగ్ పూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-శ్రీశైలం డోర్నాల హైవే, కల్వకుర్తి-నంద్యాల హైవే వంటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. వివిధ కారిడార్ల ద్వారా 1335 కిలోమీటర్ల జాతీయ రహదారుల రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాదిలో రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో అవుటర్ కారిడార్ మోడల్స్ ను అధ్యయనం చేయాలి." అని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos