సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. ఓ కొత్త ఉద్యోగంలో చేరారు. హైదరాబాద్ కు చెందిన ఓ గ్రీన్ ఎనర్జీ సంస్థలో అత్యున్నత స్థాయి పోస్ట్ లో జాయిన్ అయ్యారు. దీంతో ఇక క్రియాశీలక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టయింది. సమకాలీన రాజకీయాల్లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోవడం దీనికి ఓ కారణంగా భావిస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన జేడీ లక్ష్మీనారాయణ.. తన ఐపీఎస్ సర్వీసులకు అర్ధాంతరంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టారు. జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. 2019 నాటి ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ గెలవలేకపోయారు. సుమారు మూడు లక్షల వరకు ఓట్లను సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అనంతరం జనసేన నుంచి బయటికి వచ్చి, కొత్తగా రాజకీయ పార్టీని పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. అది కూడా ఆయనకు అచ్చి రాలేదు. దీంతో చాలాకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు శాశ్వతంగా తప్పుకొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్న మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆపరేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విచారణతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ దశలో వైఎస్ఆర్సీపీలో గానీ లేదా భారతీయ జనతా పార్టీలో గానీ చేరొచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి గానీ అది కార్యరూపం దాల్చలేదు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos