మంగళగిరి: నాయకులు, కార్యకర్తల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చానని, చిన్న వయసులో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారని.. నాయకులు, కార్యకర్తలు, తెలుగుజాతి కోసం అహర్నిశలు కృషిచేస్తానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుజాతిని ప్రపంచపటంలో పెట్టింది మన లెజెండ్ సీబీఎన్ గారు. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. ఓడిపోయినప్పుడు వెనకడుగు వేయలేదు.. గెలిచినప్పుడు కాలర్ ఎగరేసుకుని తిరగలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
నాపై బాధ్యత మరింత పెరిగింది, కలిసికట్టుగా పనిచేద్దాం
44 ఏళ్ల గొప్ప చరిత్ర ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి, పార్టీ నాయకులకు పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. యువగళం పాదయాత్రలో మిమ్మల్నందరినీ కలుసుకుంటూ, మీ సమస్యలు వింటూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తూ వచ్చాం. ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఏం చేస్తే ఈ పదవికి న్యాయం జరుగుతుందనే విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఓ వైపు బాధ్యత మరోవైపు ఈ బరువును కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు. వేదికపై ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, వేదిక ముందున్న నాయకులవైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం చేయాలి, కలిసికట్టుగా మనం ముందుకు వెళ్లాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. నేను ఒక్కడినే చేయగలననే అహంకారం నాకు లేదు. లోకేషే అన్నీ చేయగలుగుతాడని మీరనుకుంటే పొరపాటు పడినట్లే.
నాడు, నేడు, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడతా
నాడు, నేడు, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడతానని పాదయాత్రలో హామీ ఇచ్చా. నియోజకవర్గ పర్యటనల్లో నేను, చంద్రబాబు గారు ముందుగా కార్యకర్తలను కలుస్తున్నాం. చివరివ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే తిరిగిరావడం జరుగుతోంది. ఐదేళ్లలో నరకం అనుభవించాం. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడున్న ప్రతి నాయకుడిపై అక్రమ కేసులు పెట్టారు, వేధించారు. పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాక్కోవాలని అనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టినా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు ఆదర్శం. పల్నాడులో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు బూత్ లో నిలబడిన మంజుల నాకు స్ఫూర్తి. వారి నాయకుడిని విమర్శిస్తున్నారని కన్నుపోయే విధంగా చెన్నుపాటి గాంధీపై దాడి చేశారు. అయినా ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా జై తెలుగుదేశం అని నినదించిన చెన్నుపాటి గాంధీ నాకు స్ఫూర్తి.
పార్టీ సిద్ధాంతాలే మనకు బలమైన పునాది
కోటి సభ్యత్వాలతో రికార్డ్స్ బద్దలు కొట్టాం. ప్రమాదబీమా రెండు లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. ఇప్పటివరకు సుమారుగా కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేశాం. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి సాయం అందిస్తున్నాం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం కానీ నిలబడ్డాం. ఎప్పుడూ అధైర్యపడలేదు. దానికి ప్రధాన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం 6 శాసనాలు రూపొందించుకున్నాం. అందులో మొదటిది తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో-సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత. మన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలి. మనం అందరం సిద్ధాంతాల కోసం పనిచేయాలి.
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా నడిపిస్తున్నాం
గడిచిన రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా నడిపిస్తున్నాం. మనం అందిస్తున్న సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసింది మనం. ఇప్పుడు రూ.4వేల పెన్షన్ ఇస్తోంది మనమే. దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు ఇస్తోంది మనమే. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చినమాట నిలబెట్టుకుంటున్నాం. దీపం పథకం కింద ఏటా ఉచితంగా 3 సిలిండర్లు అందిస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేశాం. 6వేల కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేశాం. 10,060 పోస్టులతో జాబ్ కేలండర్ విడుదల చేసిందీ మనమే. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికివందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఐదేళ్లు అధికారంలో ఉండి రోడ్డు మీద గుంతలు పూడ్చలేదు. ఇప్పుడు గుంతలు పూడ్చి, రోడ్లు వేస్తున్నాం. చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాం. పెట్టుబడుల్లో కూడా ఏపీ నెం.1. దేశానికి వంద రూపాయలు పెట్టుబడి వస్తే మన రాష్ట్రానికి 25 రూపాయల పెట్టుబడి వస్తోంది. మనది గూగుల్.. వారిది గొడ్డలి. ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రెన్యూ, టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే 800 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి వచ్చాయి. యుద్ధప్రాతిపదికన గ్రౌండింగ్ చేస్తున్నాం.
మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి
మనకి సినిమా చూపిస్తా అంటున్న రప్పా, రప్పా బ్యాచ్ కి ఒకటే చెబుతున్నా. మీ సినిమా విధ్వంసం.. మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మామయ్య బాలయ్య బాబు తొడకొడితే ఒక్కరు కూడా ఉండరు. ఈ సైకో బ్యాచ్ బతకదు. మీ సినిమాకు ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే. ఇది గుర్తుపెట్టుకోండి.
ప్రజల చుట్టూ తిరిగితే.. పార్టీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది
మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వారిని గుర్తిస్తున్నాం. టెక్నాలజీతో అనుసంధానం కావాలి. మై టీడీపీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేస్తే.. తప్పనిసరిగా జల్లెడ పట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ తెలుగుదేశం పార్టీ వస్తుంది. ప్రజల చుట్టూ తిరిగి వారి సమస్యలను పరిష్కరిద్దాం. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. గదుల్లో కూర్చొని పనిచేస్తే మన ఆశయాలు సాధించలేం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos