అంగన్వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో నెల రోజులకు పైగా వారి సమ్మె కొనసాగుతూనే ఉంది. వారంతా చిరుద్యోగులు పెరిగిన ధరలతో కుటుంబ పోషణ కష్టమైనందుకే రోడ్డు ఎక్కారు కుటుంబ సభ్యుల కడుపు నింపేలా వేతనాలు పెంచాలన్న వీరి డిమాండ్ పై సానుకూలంగా స్పందించాల్సిన సీఎం జగన్ ఆ గళాన్ని తొక్కుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా వారి విధుల్ని అత్యవసర సేవల చట్టం - ఎస్మా పరిధిలోకి తెచ్చారు. 16 రోజులు పారిశుధ్య కార్మికులు పోరాటం చేస్తే వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ప్రభుత్వం... అదే అంగన్వాడీలు 31 రోజులకు పైగా ఆందోళన చేస్తుంటే మాత్రం వారిపై కక్షగట్టి... వారికి వస్తున్న అరకొర వేతనంలోనే కోత పెడుతోంది. వేతనాలు పెంచాలని అంగన్వాడీలు కోరుతున్నది ఇదే ప్రథమం కాదు... మూడేళ్లుగా వివిధ రూపాల్లో వినతులు ఇస్తూనే ఉన్నారు. కనీసం ఒక్కనాడు జగన్ వారిని పిలిచి సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదు. సమ్మె మొదలయ్యాక ఇప్పటివరకు వారికి తాడేపల్లి ప్రాజెక్టులోకి ప్రవేశమే కల్పించలేదు. గత ప్రభుత్వాల హయాంలోనూ వారు అనేక పోరాటాలు చేశారు ఏ ముఖ్యమంత్రి ఈ తరహా వ్యవహరించలేదు. 2014 - 19 మధ్య ఎన్నడూ లేనివిధంగా ఒక్కో అంగన్వాడి కార్యకర్తకు 6,300 రూపాయలు పెరిగింది. అప్పుడు వారి సమస్యలను ఆలకించే టీడీపీ ప్రభుత్వం వేతనాలు పెంచింది. 2019 - 24 మధ్య నిత్యావసర ధరలు నింగినంటాయి. పైగా వారికి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపేశారు. సానుభూతితో స్పందించాల్సిన సీఎం ... వారి వేదనలను పట్టించుకోకుండా మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు దూషణలకు దిగుతున్నా మిన్నకుండిపోవడం... పైగా చర్చల పేరుతో పిలిపించుకొని బెదిరింపులకు దిగడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రాట్యూటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ...కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మెజారిటీ డిమాండ్లను పరిష్కరించామంటూ తప్పుడు ప్రచారం చేయడం ఇంకో ఎత్తు. కాగా అంగన్వాడీల డిమాండ్లయిన వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చడం, మట్టి ఖర్చులు వంటి డిమాండ్లను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది అలాగే పదవీ విరమణ ప్రయోజనం ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేయగా ఇప్పటికే ఇస్తున్న 50 వేలకు మరో 50 వేలను పెంచింది. ఆఖరి వేతనం లో 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేయగా... దాన్ని పెండింగ్ లో పెట్టింది. అలాగే సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను కూడా పెండింగ్ లో పెట్టింది. టీ ఏ డీ ఏ ల చెల్లింపు జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పింది. ఆయా లకు అంగన్వాడీ లు గా పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ పైన ప్రభుత్వం అర్హత వయసు 45 నుంచి 55 ఏళ్లకు పెంచింది. అలానే అద్దె బకాయిల డిమాండును పరిష్కరించింది కానీ వేతనాలు పెంచాలన్న డిమాండు ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ లు సమ్మె విరమించేందుకు ససేమిరా అంటున్నారు
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos