అమరావతి :రాష్ట్రంలోని స్వర్ణ గ్రామం,స్వర్ణవార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమం,స్వర్ణ గ్రామం,స్వర్ణ వార్డుల శాఖామాత్యులు డా.డోల బాల శ్రీ వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ లక్షా 23 వేల మందిని స్వర్ణ గ్రామం,వార్డుల్లో ఉద్యోగులుగా నియామకం చేసి పెద్దఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుని వారి సర్వీసు రూల్స్ గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు.ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి అన్ని అంశాలను చర్చించి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేయడం జరుగుతోందన్నారు.ఇప్పటికే 14వేల మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికిపైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు.రికార్డు అస్టిస్టెంట్ కేడర్‌లో నియామకమైన ఈ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వంపై 150 కోట్ల రూ.లు అదనపు భారం పడుడున్నా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ వర్తింప చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అదే విధంగా సెలవులకు సంబంధించి ఏప్రభుత్వ శాఖలోను లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.ఈ ఉద్యోగులకు సంబంధించి న్యాయమైన ఆచరణ సాధ్యమైన డిమాండ్లన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.
అయినప్పటికీ ప్రభుత్వ అనుమతి ఇవ్వకున్నా ఆదివారం విజయవాడలో ధర్నాకు సుమారు 2వేల మంది స్వర్ణ గ్రామం,స్వర్ణవార్డు ఉద్యోగులు పాల్గోవడం ఎంతమాత్రం సరికాదని మంత్రి పేర్కొన్నారు.ఆధర్నా సమయంలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ హఠాన్మరణం చాలా బాధాకరమైన విషయమని పేర్కొంటూ ఆసంఘటనను సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కొంతమంది ఉద్యోగులు పొస్టులు పెట్టడం చాలా దురదృష్టకరమని ఖండించారు.స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల ఆందోళనల వెనుక ఎవరున్నారో అర్థం కావడం లేదని వారి డిమాండ్లను మేం పరిష్కరిస్తుంటే ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని మంత్రి పేర్కొన్నారు.సర్వీస్‌రూల్స్ లేకుండా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మేం సరి చేస్తున్నాం ప్రభుత్వంపై ఒత్తిడి చేసి డిమాండ్లు సాధిస్తామంటే సరికాదన్నారు.ప్రభుత్వంపై, ప్రభుత్వ అధినేతలపై ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని గత ప్రభుత్వం నియమించిందని కదాని మేము వారిపై వివక్ష చూపించట్లేదని అన్నారు.జగన్ గత ఐదేళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు చేయాల్సిన మంచి చేస్తున్నామని ఉద్యోగులు పరిస్థితి అర్థం చేసుకోవాలని అన్నారు.విధుల్లో సీఐ చనిపోతే చస్తే చావనీలే అంటూ కొందరు ఉద్యోగులు మానవత్వం లేకుండా మాట్లాడడం సరికాదని అన్నారు.ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోకుండా ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా జగన్ వ్యహరిస్తున్నారని విమర్శించారు.సీఐ మృతిపై జగన్ ఎందుకు మాట్లాడలేదు ? జగన్ కి కనీస మానవత్యం లేదా ? నాడు జగన్ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఎందుకు ప్రమోషన్ చానల్ క్రియేట్ చేయలేదు ? స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు ఎప్పుడైనా తమ సమస్యలు ప్రభుత్వానికి ఎందుకు తీసుకురాలేదని అన్నారు.
జిఓఎంస్ సంఖ్య 11 గురించి మంత్రి మట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పనులకు సంబంధించి తమకు కేటాయించబడిన విధులను నిర్వహించాల్సి ఉంటుందని అంతేగాని ఆఉత్తర్వులు ఉద్యోగులపపై అదనపు భారాన్ని పెంచే ఉద్దేశ్యంతో జారీ చేసినవి కావని స్పష్టం చేశారు.ప్రభుత్వ పరిపాలన అవసరాల మేరకు ఉద్యోగులకు అప్పగించబడే విధులను వారు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు,రెగ్యులరైజేషన్ను మా ప్రభుత్వమే అమలు చేసిందని అన్నారు.నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ను ఇప్పటికే ఆర్థికశాఖకు పంపడం జరిగిందని అన్నారు.సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఒకరికొకరు సేవలు అందించేలా డీసెంట్రలైజ్ చేశామని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఉద్యోగులకు మేలు చేయాలన్న తపన తప్ప వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఐటి మరియు స్వర్ణ గ్రామం,స్వర్ణ వార్డుల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ 2019-20 సంవత్సరాల్లో సుమారు లక్షా 23 వేల మందిని నెలకు 15వేల రూ.ల ఏకీకృత వేతనం(కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్)తో నియమాకం చేయడం జరిగిందన్నారు.ఆతదుపరి నిర్దేశిత నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ప్రకటించిన తర్వాత అర్హత గల వారికి గెర్యులర్ పే స్కేలు వర్తింపబడిందని తెలిపారు.ఆటోమేటికి అడ్వాన్స్మెంట్ స్కీమ్ కు సంబంధించి సుమారు లక్షా 14 వేల మందికి అర్హత కలిగిన ఉద్యోగులకు ఈప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు.ఒకే పోస్టులో 6 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారికి ఈపధకం వర్తిస్తుందని ఇందుకు సంబంధించి ఈనెల 21న జిఓ సంఖ్య 7ను జారీ చేయడం జరిగిందన్నారు.ఉద్యోగులు పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే 18 కేడర్లలో 14వేల 331 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా మరో 800 మందికి పదోన్నతులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు.ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్పేర్ అసిస్టెంట్ కేడర్లకు మూడు వారాల్లోగా పదోన్నతి మార్గదర్శకాలు సిద్ధం కానుండగా వారికి కూడా పదోన్నతులు కల్పిస్తారని తెలిపారు.
స్వర్ణ గ్రామం,స్వర్ణ వార్డు ఉద్యోగులు సెలవులు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆటోమేటిక్ క్యాజువల్ లీవ్ అప్రోవల్ ఫెసిలిటీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని సంబంధిత కాంపిటెంట్ అధారిటీ సెలవు ధరఖాస్తుపై 24 గంటల్లోగా చర్య తీసుకోకుంటే ఆ క్యాజువల్ లీవ్ ధరఖాస్తు స్వయం చాలకంగా ఆమోదించ బడినట్టు పరిగణించబడుతుందని కార్యదర్శి భాస్కర్ స్పష్టం చేశారు.అంతేగాక ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే ఆర్జిత సెలవు(ఎర్న్ లీవు) ఇతర సెలవు ప్రయోజనాలు,ఇంక్రిమెంట్లు అర్హత మేరకు అందివ్వబడతాయని వివరించారు.ఉద్యోగుల పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి జిల్లాలో జిల్లా స్వర్ణ గ్రామ,స్వర్ణవార్డు అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.ప్రతినెలా ఇందుకు సంబంధించి గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేశామని,అత్యవసర సందర్భాల్లో మినహా మిగతా సెలవు రోజుల్లో ఉద్యోగులకు విధులు కేటాయించకుండా జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డుల ఉద్యోగులకు కూడా మరణ ప్రయోజనాలు(Death Benefits)అందివ్వబడుతున్నాయని అర్హత గల ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 3 నెలల్లోగా ఈప్రయోజనాలు అందేలా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకూ 121 మందికి సంబంధించి కారుణ్య నియామకాలు కల్పించబడ్డాయని తెలిపారు.నోషనల్ ఇంక్రిమెంట్లకు సంబంధించి ఆయన మట్లాడుతూ ప్రొబేషన్ ప్రకటించిన అనంతరం ఉద్యోగులకు PRC-2022 పే స్కేళ్ళు అమలు చేయడంతోపాటు అర్హత గల వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంచ్ స్కీమ్ కూడా అమలు చేయబడిందన్నారు.స్టైఫండ్ కాలానికి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయడానికి ప్రస్తుతం స్పష్టమైన నిబంధన లేనప్పటికీ ఈఅంశంపై తగిన ఉత్వర్యులు జారీకి ఎస్జిఎస్డబ్ల్యూ శాఖ ద్వారా ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్టు వివరించారు.
ఇక ఉద్యోగుల జూనియర్ అసిస్టెంట్ కేడర్ కావాలన్న డిమాండ్ కు సంబంధించి మాట్లాడుతూ ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కీమ్ మంజూరైన త్వర్వాత స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డుల ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ కేడర్ కు సమానంగా నియమించబడినప్పటికీ,వారు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ చేరుకున్నందున జూనియర్ అసిస్టెంట్ కేడర్ కోసం డిమాండ్ చేస్తున్నారని ఇది అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ ప్రభావితం చేస్తుందని ఇది నిబంధనలకు విరుద్ధమని అంతేగాక 20 కేడర్ల ఉద్యోగులందరినీ జూనియర్ అసిస్టెంట్ కేడర్ కు అప్‌గ్రేడ్ చేయడానికి ఎలాటిం నిబంధన లేదని స్పష్టం చేశారు.అంతేగాక ఈవిధమైన అన్యాయమైన డిమాండ్ కు వ్యతిరేకంగా ఇతర శాఖల ఉద్యోగులందరూ తురుగుబాటు చేసే అవకాశం ఉందని కార్యదర్శి భాస్కర్ అన్నారు. ఈసమావేశంలో స్వర్ణ గ్రామం,స్వర్ణ వార్డుల శాఖ సంచాలకులు శివ ప్రసాద్ పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos