ఉండవల్లి: చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం మరింత బలోపేతంపై ఇరువురు చర్చించారు. భారత్-సింగపూర్ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వంలో పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాం. రాష్ట్రంలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రతి 15 రోజులకోసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నాం. రాష్ట్రంలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయి. రాష్ట్రంలో గతేడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. గతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానంలో ముందుకు వెళ్తున్నాం. సింగపూర్ తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు ఏపీ ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. రష్యా పర్యటన విశేషాలను పంచుకున్నారు. ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ మాట్లాడుతూ.. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీ మంత్రుల బృందం, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏపీతో భాగస్వామ్యం బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos