ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఏపీలో ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టనున్న నేపధ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన, మంత్రి లోకేష్ పైన ప్రశంసల జల్లు కురుస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో విశాఖ నగరంలో మద్దిలపాలెం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హనుమంతవాక, సిరిపురం, వెంకోజిపాలెం, పీఎం పాలెం, క్రికెట్ స్టేడియం తదితర కూడళ్ళలో సీఎం చంద్రబాబు, లోకేష్ లను ప్రశంసిస్తూ భారీ హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గంట రవితేజ పేరు మీద ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ అందరూ చర్చించుకునేలా చేస్తున్నాయి. నాడు చంద్రబాబు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చి హైదరాబాద్ గతిని మార్చగా నేడు కుమారుడు లోకేష్ కృషితో రానున్న గూగుల్ విశాఖ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని, గేమ్ చేంజెర్స్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటూ ఏర్పాటుచేసిన భారీ హోర్డింగ్స్ ఆసక్తికరంగా మారాయి.
15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు దేశం మొత్తం చూపు విశాఖపట్నం పైనే ఉందని విశాఖ ప్రాముఖ్యతను తెలియజేస్తూ చంద్రబాబు వైజాగ్ లో G గూగుల్ లోగో తో కలిపి క్రియేటివ్ పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాఖకు గూగుల్ రాక పైన జరుగుతున్న హైప్ తో మంత్రి లోకేష్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళుతున్న లోకేష్ స్థానికంగా గుర్తింపును పొందుతున్నారు.
ఇక ప్రస్తుతం విశాఖకు గూగుల్ ఏఐ డేటా కేంద్రాన్ని తీసుకురావడంలో లోకేష్ కీలక భూమిక పోషించారని, చంద్రబాబు కంటే లోకేష్ ను ఎక్కువ మంది కొనియాడుతున్న క్రమంలో నారా లోకేష్ వ్యక్తిగత ఇమేజ్ అమాంతం పెరిగింది. అమెరికా పర్యటన ద్వారా గూగుల్ ప్రతినిధులను ఒప్పించి ఈ ప్రాజెక్టును సాధించడంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. ఇక విశాఖకు google లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు కూడా మరింత బలమైన పునాదిని వేస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos