వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులను సమీకరించి ప్రజల జీవన విధానానికి ఇబ్బంది కలిగించారని పోలీసులు కేసులు  పెట్టారు. అందులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రికి చిక్కులు తప్పేలా లేవు. ఇంతకీ ఇబ్రహీం పట్నంలో ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం జనవరి చివరలో మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జరిగిన చర్చల సందర్భంగా జోగి రమేష్‌ .. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించాయి. దీని ఫలితంగా ఫిబ్రవరి 1న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసంపై ఒక భారీ గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేనప్పటికీ తల్లిదండ్రులు, భార్య ఉన్నట్టు చెబుతున్నారు. నిరసనకారులు ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరారు. ఫర్నీచర్ తగలబెట్టారని పోలీసులు గుర్తించారు.  దీంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 6న జోగి రమేష్‌ను పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం రావాలని నిర్ణయించారు. దీన్ని ఒక సామాన్య పరామర్శ పర్యటనలా కాకుండా, పార్టీ బలాన్ని చాటేలా జన సమీకరణగా మార్చారు. అయితే విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు జగన్ కాన్వాయ్‌ను వెస్ట్‌ బైపాస్ మీదుగా వెళ్లాలని ముందే నోటీసులు ఇచ్చారు. కానీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీసుల సూచనలను పట్టించుకోకుండా మెయిన్ రోడ్డు మీదే భారీ బైక్ ర్యాలీతో ముందుకు సాగారు. సాధారణంగా గంటలోపు పూర్తి కావాల్సిన 35 కిలోమీటర్ల ప్రయాణం ఏకంగా ఐదున్నర గంటల పాటు సాగింది. ఈ లోపు నేషనల్‌ హైవే పూర్తిగా స్తంభించిపోయింది. అంబులెన్స్‌లు, సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు  పడ్డారు.

ఈ ట్రాఫిక్ జామ్‌, నిబంధనల ఉల్లంఘనపై ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా జోగి రమేష్‌పై క్రైమ్‌ నంబర్‌ 76/2026 కింద కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి, ట్రాఫిక్ కంట్రోల్‌ చేయకుండా అడ్డుకున్నారని సెక్షన్ 132 పెట్టారు. బైక్ ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని, ఇది అక్రమంగా గుమిగూడటం కిందకు వస్తుందని సెక్షన్ 189(2) ప్రయోగించారు. జాతీయ రహదారిపై గంటల తరబడి దిగ్బంధించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు కేసు పెట్టారు. రాజకీయంగా చాలా సెన్సిటివ్‌ ఏరియాల్లో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పోలీసులు రిపోర్టులో సున్నిత ప్రాంతాలు అనే పదాన్ని పదే పదే వాడారు. ఇబ్రహీంపట్నం ఏరియాలో కొన్ని చోట్ల టీడీపీ ఆఫీస్‌లు ఉన్నాయి. మరికొన్ని చోట్ల గతంలో గొడవలు జరిగిన చరిత్ర ఉంది. అటువంటి  ప్రాంతాల్లో కావాలనే ర్యాలీని నెమ్మదిగా నడపడం లేదా నినాదాలు చేయం వల్ల మళ్లీ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావించారు. ఈ పాయింట్‌ను బేస్ చేసుకునే పోలీసులు దీనిని సాదాసీదా ట్రాఫిక్ ఉల్లంఘనకు కాకుండా , లా అండ్ ఆర్డర్‌కు ముప్పు కలిగంచే చర్యగా చూస్తున్నారు. దీని వల్ల జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. 

Related Videos