అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాబోయే ఆరు వారాల్లోగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
50 శాతం రిజర్వేషన్ల పరిమితి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను న్యాయస్థానం కొట్టివేసింది. ఓటర్ల సమగ్ర రివిజన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఓటర్ల జాబితా రివిజన్ అంశాన్ని కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేయాలన్న అభ్యర్థనకు కోర్టులో ఉపశమనం లభించలేదు.
పంచాయతీల విలీనం, వార్డుల పునర్విభజనకు సంబంధించిన పిటిషన్లు కొట్టివేత..
పంచాయతీల విలీనం, వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియపై కసరత్తును ప్రారంభించనుంది. రానున్న ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే దిశగా ఎస్ఈసీ చర్యలు చేపట్టనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు, ఆశావహులు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించే పరిస్థితి నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos