విజయవాడ : ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ప్రతి ఓటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అమూల్యమైన శక్తి అని వక్తలు పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడు నిర్వర్తించాల్సిన అత్యున్నత బాధ్యత కూడా అని వారు స్పష్టం చేశారు. నగరంలోని లెమన్ ట్రీ హోటల్‌లో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడీఈఎం), ఈసీఐ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఐడియా), ఏపీ సీఈవో సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతలపై అంతర్జాతీయ వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యశాలకు ఈసీఐ, ఐఐఐడీఈఎం, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల విభాగాల ప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, దాని సంస్థలు, ఎన్నికల వ్యవస్థలు సజావుగా, సమర్థవంతంగా పనిచేయడమనేది వివిధ పక్షాల చురుకైన, బాధ్యతాయుతమైన భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందని.. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య విజయానికి, విశ్వసనీయతకు, బలోపేతానికి నిజమైన పునాది అని పేర్కొన్నారు. మంచి అవగాహనతో సరైన నిర్ణయం తీసుకోగల ఓటరే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లడానికి కీలకమన్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో పోలింగ్ శాతం 30% లేదా అంతకంటే తక్కువగా ఉండేదని.. ఆ తర్వాత అది క్రమేణా పెరుగుతూ వస్తోందని.. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇది 92 శాతం దాటిందని వివరించారు. ఓటర్లలో అవగాహన, వారి భాగస్వామ్యం కోసం ఈసీఐ తీసుకున్న బలమైన చర్యలు ఈ ఫలితాలకు దోహదం చేశాయన్నారు. ఓటు వేయడం కోసం ప్రజలు తమ జీవనోపాధిని లేదా ఉద్యోగాలను వదిలి సొంత ఊళ్లకు రాకుండా, ఎన్నికల ప్రక్రియలో వారిని ఎలా భాగస్వాములను చేయాలనే దానిపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్త అత్యుత్తమ విధానాల అధ్యయనం, సమాచార మార్పిడికి ఇలాంటి కార్యశాలలు ఉపయోగపడతాయని అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు.
అక్షరక్రమంలోనే కాదు.. పోలింగ్ శాతంలోనూ ముందుండాలి: రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
అక్షరక్రమంలోనే కాదు.. పోలింగ్ శాతంలోనూ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుండాలని ప్రత్యేక అతిథి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదని.. అది బాధ్యత కూడా అని, విశిష్టమైన ఓటు హక్కు గురించి యువత తెలుసుకొని, అందరికీ తెలియజేయాలని అన్నారు. పొరుగు దేశాలతో చూస్తే మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉందని.. ఇందుకు ప్రధాన కారణం ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో, విచక్షణతో పనిచేయడమేనని పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగపరంగా లభించిన హక్కు అని.. దాన్ని బాధ్యతాయుతంగా భావించాలి, గౌరవించాలి, గుర్తించాలి, వ్యవహరించాలని.. అలా లేనప్పుడు అది బాధ్యతారాహిత్యమే అవుతుందన్నారు. కీలమైన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి బీఎల్‌వోలకు సరైన శిక్షణ అందించి, వారి బాధ్యతను గుర్తుచేస్తూ ఇక్కడి కలెక్టర్లు ముందుకు తీసుకెళ్లడం హర్షణీయమని రమేష్ కుమార్ పేర్కొన్నారు. చట్టపరంగా వచ్చే హక్కులు, రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులు, ప్రాథమిక హక్కులు గురించి వివరించడంతో పాటు ఓటు హక్కుకు సంబంధించి వివిధ కేసుల గురించి ఆయన వివరించారు.
సమ్మిళిత ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం: ఏపీ సీఈవో వివేక్ యాదవ్
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ మాట్లాడుతూ భారత్ ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఐడియా కౌన్సిల్ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు మన రాష్ట్రం ఈ కీలకమైన అధ్యయన బాధ్యతను చేపట్టినట్లు తెలిపారు. సమ్మిళిత, శాంతియుత, స్థితిస్థాపక, సుస్థిర ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం అనే ప్రధాన ఇతివృత్తంతో ఇంటర్నేషనల్ ఐడియాకు భారత్ అధ్యక్షత వహిస్తున్నట్లు వివరించారు. ఓటర్ల అర్హత అంశంపై 9-సోపానాల (9-step methodology) ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనం చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వినియోగించేలా నమూనా ప్రమాణాలను రాష్ట్రం రూపొందిస్తోందని పేర్కొన్నారు. అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించి, 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించి పారదర్శకమైన, లోపరహితమైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని తెలియజేస్తూ కార్యక్రమం ప్రగతిని సీఈవో వివేక్ యాదవ్ వివరించారు.
*కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ* ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు. సార్వజనీన ఓటు హక్కుతో పాటు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్, ప్రాంతం మారినప్పుడు ఆటోమేటిక్ షిఫ్టింగ్, రాజకీయ పార్టీలలో నమ్మకం సాధించడం అనేవి ఆదర్శవంతమైన ఓటర్ల జాబితాకు ముఖ్య సూత్రాలన్నారు. స్వచ్ఛందంగా ఆధార్ అనుసంధానం వల్ల భవిష్యత్తులో డిజిటల్ డేటా ఆధారంగా తప్పులు లేని, స్వయంచాలకంగా నమోదయ్యే ఓటర్ల జాబితాను తయారు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో నమోదు అనేది కేవలం పరిపాలనాపరమైన పని మాత్రమే కాదని, అది ఒక రాజ్యాంగ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పవిత్రతను కాపాడేందుకు చట్టపరమైన కచ్చితత్వంతో పాటు మానవతా దృక్పథం అవసరమని, అలాగే అకడమిక్ పరిశోధనలు క్షేత్రస్థాయి అధికారుల ప్రత్యక్ష అనుభవాలు అత్యుత్తమ విధానాల రూపకల్పనకు దోహదం చేస్తాయని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, అధికారులు, భాగస్వామ్య సంస్థలకు అభినందనలు తెలియజేస్తూ, ఈ వర్క్‌షాప్ ద్వారా వచ్చిన సూచనలు భవిష్యత్ ఎన్నికల సంస్కరణలకు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos