విశాఖపట్నం : ‘ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులతో తీవ్రమైన సమస్యలుండేవి. సుమారు 132 నుంచి 142 ఏనుగులు గుంపులుగా ఏజెన్సీ ప్రాంతంలో కల్లోలం సృష్టించేవి. చిత్తూరు జిల్లా పలమనేరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల గుంపులు పంటపొలాల మీద పడి పంటలను ధ్వంసం చేయడం, అడ్డొచ్చే వారిపై దాడులు చేయడంతో ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి. నేను అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల బాధ్యతలను తీసుకున్న తర్వాత మొదటిగా ప్రజలకు, ఏనుగులతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం మీదనే దృష్టి సారించాన’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదపుటేనుగులను నిరోధించేందుకు నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వ సహాయంతో తీసుకొచ్చి, వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మానవులు – వన్య ప్రాణుల మధ్య ఘర్షణలను నివారించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వీటివల్ల ఏజెన్సీ ఏరియాల్లో మంచి ఫలితాలొస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో ప్రత్యేకంగా నిర్వహంచిన జాతీయ స్థాయి సెమినార్ లో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారితో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఏనుగులు పర్యావరణ సమతుల్యతకు వారధిగా నిలుస్తాయి. దేశ వన్యప్రాణి వారసత్వానికి అవి చిహ్నాలు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2014 నుంచి దేశంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాలు 26 నుంచి 33కు పెరిగాయి. కారిడార్ల రక్షణ, 'ప్రాజెక్ట్ ఎలిఫెంట్' బలోపేతం, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 150 ఏనుగుల కారిడార్లను దేశవ్యాప్తంగా గుర్తించడం ద్వారా ఏనుగుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా ఉంది. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కుంకీ ఏనుగులను రాష్ట్రానికి అందించడంలో సహకరించిన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అప్పటి అటవీ, పర్యావరణ శాఖమంత్రి ఈశ్వర్ ఖండ్రే గారికి ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య సహకారం మాత్రమే కాదు. ఇది ప్రజలు, ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ కోసం సాగుతున్న పరస్పర సహకారం. కుంకీ ఏనుగులు ఇప్పటికే మదపుటేనుగులు చేసే విధ్వంసాలను అరికట్టే 15 కార్యకలాపాలలో సహాయపడ్డాయి. దీనివల్ల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో మానవ మరణాలు 70 శాతం తగ్గింది. పంట నష్టం కూడా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా సొంత కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాం. ఇప్పటికే ఒక శిక్షణ పొందిన కుంకీ ఏనుగు జయంత్ పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఉంది. ప్రతి ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వాలనేది మా ప్రణాళిక.
హనుమాన్ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు..
మానవులు – వన్య ప్రాణుల మధ్య నెలకొన్ని ఘర్షణలను పూర్తిగా నిరోధించేందుకు, వన్య ప్రాణులను రక్షణ కోసం రూపొందిన హనుమాన్ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. వేగవంతమైన స్పందన, సాంకేతికత, వణ్య ప్రాణులతో కలిగే నష్ట నివారణ కోసం సమగ్ర మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణ వ్యవస్థ అయిన H.A.N.U.M.A.N (హనుమాన్) ప్రాజెక్టును 2026, మార్చిలో ప్రారంభించాం. 93 స్పందన వాహనాలు, 7 వన్యప్రాణి అంబులెన్స్‌లను ఈ ప్రాజెక్టులో సిద్ధం చేశాం. ఇప్పటి వరకు 200కు పైగా వన్యప్రాణులు రక్షించడమే కాకుండా, 30కి పైగా వన్యప్రాణులను తరలింపు కార్యక్రమం జరిగింది. సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. సమాజాన్ని దీనిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి రైతు భయం లేకుండా సాగు చేయగలిగే పరిస్థితికి చేరుకోవాలన్నదే లక్ష్యం. వణ్య ప్రాణులను, ప్రజలను విడదీయడం మా ఉద్దేశం కాదు... ప్రజలు, వన్యప్రాణులు ఒకే ప్రదేశంలో సురక్షితంగా కలిసి జీవించగలిగే భవిష్యత్తును సృష్టించడమే అసలైన విజయం” అని అన్నారు.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 జెయింట్ స్టెప్స్ పుస్తకావిష్కరణ..
అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన “ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 జెయింట్ స్టెప్స్” పుస్తకాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారితో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలో ఏనుగుల సంరక్షణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తోపాటు వైల్డ్ లైఫ్ సైన్స్ కి సంబంధించిన పలు పుస్తకాలను విడుదల చేశారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కలంకారీ కళాకారులు రూపొందించిన ప్రత్యేక కళాఖండాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం దేశవ్యాప్తంగా 21,450 పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో 20 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఏనుగుల సంరక్షణ చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకి చెందిన క్షేత్ర స్థాయి అటవీ శాఖ అధికారి జుగల్ నాయక్ కు గజ గౌరవ్ అవార్డును అందజేశారు. కుటుంబాలను సత్కరించి, ఏనుగుల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసిన, రక్షణ చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos