కుప్పం : రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కుప్పం నుంచి ఆయన ఈ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలపై సీఎం పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో ఇవాళ సువర్ణ అధ్యాయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టే కార్యక్రమాన్ని రూపొందించిన మున్సిపల్ శాఖ మంత్రి, అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
ప్రస్తుతం ప్రారంభించిన పనుల విలువ రూ.11,359 కోట్లు అని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే జరుగుతున్న పనులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే రాష్ట్ర పట్టణ ప్రాంతాల దశ, దిశ మారుతుందని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.22,330 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, మరో ఆరు నెలల్లో సుమారు రూ.17 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించనున్నట్లు** తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో కూడా భారీగా పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
విశాఖపట్నం నగరంలో ఒక్క కార్పొరేషన్ పరిధిలోనే సుమారు రూ.3,890 కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు.
మున్సిపాలిటీల్లో రహదారులు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, సీవరేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పట్టణ ప్రాంతాలు గ్రోత్ ఇంజన్లుగా మారాలని చంద్రబాబు అన్నారు. వీకెండ్ ఎకానమీని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వారాంతాల్లో తమ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్, రవాణా వంటి అవసరాలకు కూడా పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నారని తెలిపారు.
పట్టణాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు..
పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండేలా పట్టణాలను అభివృద్ధి చేయాలని అన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు 24 గంటలూ సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంస్కరణలను చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గడచిన రెండేళ్లుగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రహదారులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 143 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశామని సీఎం తెలిపారు. ప్రస్తుతం రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో నాలుగు ప్లాంట్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.
2047 నాటికి ‘స్వర్ణ మున్సిపాలిటీలు’
2047 నాటికి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని స్వర్ణ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి అని సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.
పట్టణాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పట్టణ మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రవాణా, పర్యావరణం వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos