ఎన్నికల వేళ ఏపీ రాజకీయం మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ షర్మిల కడప జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ సొంత జిల్లాలో షర్మిల ప్రభావం ఏంటనేది చర్చ మొదలైంది. ఈ సమయంలోనే ఇడుపులపాయలో షర్మిలతో సోదరి సునీత భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు గంటల సేపు వీరు చర్చలు జరిపారు. పీసీసీ బాధ్యతలను చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి. వివేకా హత్య కేసులో సునీతకు షర్మిల మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకోవైపు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా వివేకా హత్య కేసు నేపథ్యంలో సీఎం జగన్‌తో సునీతకు దూరం పెరిగింది. తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచారు. మరోవైపు... ఈ మధ్యనే వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇడుపులపాయలో షర్మిలను కలిశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి వీరిద్దరూ చర్చించుకున్నారని తెలుస్తోంది. షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే చేస్తానని ఆళ్ల చెప్పారు. కడప వేదికగా జరిగే పార్టీ సమావేశంలో షర్మిల తీసుకొనే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos