ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కస్టడీ దాడి వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న గుంటూరు పోలీసులు నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీహార్ అగ్నిమాపక శాఖ ఐజీ సునీల్ నాయక్ ను అక్కడికి వెళ్లి అరెస్టు చేసినా స్థానిక కోర్టు పీటీ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఏపీ పోలీసులకు షాక్ తప్పలేదు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసుల దూకుడు చర్యల్ని తప్పు పట్టిన బీహార్ కోర్టు రాబోయే 30 రోజుల పాటు సునీల్ నాయక్ ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూటుమార్చిన ఏపీ పోలీసులు.. ఇప్పుడు ఆయనపై ఇక్కడి కోర్టును ఆశ్రయించి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన్ను మరోసారి బీహార్ వెళ్లి అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సునీల్ నాయక్ పరారీలో ఉన్నట్లు ఏపీ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు రఘురామ కేసులో తనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై స్పందించిన సునీల్ నాయక్ తాజాగా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న రఘురామ తనకు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారని, తాను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తన మిత్రుడి ద్వారా మాజీ సీఎం జగన్ తో పాటు ఐపీఎస్ పీవీ సునీల్ కు వ్యతిరేకంగా మాట్లాడాలని, లేకపోతే ఈ కేసులో తనను నిందితుడిగా చేరుస్తామంటూ గతంలో హెచ్చరించారని ఇందులో తెలిపారు. రఘురామ కాల్ రికార్డుల్ని పరిశీలిస్తే ఈ కేసులో ఎంత మందిని ఒత్తిడి చేశారో, ఎంతమందిని ఇరికించాలని చూస్తున్నారో తెలుస్తుందన్నారు.
ఈ ట్వీట్ పై స్పందించిన ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్.. తప్పుడు సాక్ష్యాలను సమర్పించమని రఘురామ తనను బెదిరించారని సునీల్ నాయక్ ఆరోపించారని, సీడీఆర్, ఐపీడీఆర్ ద్వారా దీనిని ధృవీకరించాలని కోరారు. కారణం రఘురామ సీబీఐ కేసులను ఎదుర్కొంటుండటమేనని అన్నారు. RCBD1/2019/E/0003 (₹947 కోట్ల మోసం), RCBD1/2021/E/0002 (₹238 కోట్ల మోసం) ఇతర బ్యాంకు మోసం కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. నాయక్ వాదనలు నిజమైతే, సీబీఐ దర్యాప్తులో ఉన్న ఆ కేసుల్లో సాక్షులను రఘురామ బెదిరించి ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos