విశాఖపట్నం: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..  ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుంది. కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలి వెళ్తుందో నిర్ణయించేది విద్య. అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యాసంస్థలు మాత్రమే కావు... అవి కలలకు రూపమిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి, నాయకులను తీర్చిదిద్దుతాయి, తరాల భవిష్యత్తును మార్చేస్తాయి. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం మాత్రమే కాదు... ఇది అవకాశాల, సమ్మిళిత అభివృద్ధి వేడుక. నాణ్యమైన విద్య దేశంలోని ప్రతి మూలకు, సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేడుక.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావు... అవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలు. ఒక కుటుంబంలో తొలి తరం విద్యార్థి పట్టభద్రుడైతే... ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుంది. దీంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ.. మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి.  

రాష్ట్రపతి గారి కంటే ముఖ్య అతిథి మరొకరు ఉండరు

ఈ రోజు మీరు మీ డిగ్రీలను అందుకుంటున్న ఈ వేళ.. మీ ముందున్న ముఖ్య అతిథిని ఒక్కసారి చూడాలని నేను కోరుతున్నా. గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి మన రాష్ట్రపతి గారి కంటే మరింత అర్థవంతమైన ముఖ్య అతిథి మరెవరూ ఉండరు. ఆమె జీవితం స్వయంగా ఈ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు ఎందుకు అవసరమో చెప్పే అత్యుత్తమ సమాధానం. రాష్ట్రపతి గారు ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న ఉపర్‌బేడా అనే చిన్న గిరిజన గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో పాఠశాలకు చేరుకోవాలంటే ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. గిరిజన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడం చాలా అరుదు. అయినప్పటికీ ఆమె తన గ్రామం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తొలి మహిళగా నిలిచారు. ఆమె వేసిన ఆ ఒక్క అడుగు ఆమె భవిష్యత్తునే కాదు.. ఆమె తర్వాత వచ్చిన వేలాది గిరిజన బాలికల ఆశయాలను కూడా మార్చింది.

స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము గారు

ప్రజా జీవితంలోకి ప్రవేశించే ముందు.. ఆమె రాయరంగ్‌పూర్‌లోని శ్రీ అరవిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. ఉపాధ్యాయ వృత్తి తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని, ప్రజా విధానాలను రూపొందించే ముందు విద్యార్థుల జీవితాలను మలిచే అవకాశం తనకు దక్కిందని ఆమె తరచూ చెబుతుంటారు. నాయకత్వం అనేది సేవతోనే ప్రారంభమవుతుందని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఆమె ప్రజా జీవితం వారసత్వ ఆధారంగా వచ్చింది కాదు. రాయరంగ్‌పూర్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌లో కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం వైస్‌ ఛైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్‌గా, చివరకు భారత రాష్ట్రపతిగా ఎదిగారు. ప్రజాసేవ ద్వారా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో సాధించారు.

సంకల్ప బలంతో ప్రజాసేవలోకి తిరిగొచ్చారు

అయితే రాష్ట్రపతి గారి ప్రయాణాన్ని అసాధారణంగా నిలబెట్టింది ఆమె అధిరోహించిన పదవులు మాత్రమే కాదు.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు కూడా. 2009 నుంచి 2014 మధ్య ఆమె తన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, భర్త, తల్లి, సోదరుడిని కోల్పోయారు. అలాంటి దుఃఖాన్ని ఊహించడం కూడా మనలో చాలామందికి సాధ్యం కాదు. అయినప్పటికీ ఆమె నిరాశకు గురికాలేదు. ఆధ్యాత్మికతలో బలాన్ని వెతుక్కొని.. కొత్త సంకల్పంతో తిరిగి ప్రజాసేవలోకి వచ్చారు. తన వ్యక్తిగత బాధను సమాజం పట్ల కరుణగా, సేవా సంకల్పంగా మలిచారు. 2022లో భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా.. భారతదేశంలోని పేదలు కలలు కనడమే కాదు, ఆ కలలను నిజం చేసుకోగలరనే విషయానికి నా ఎన్నికే నిదర్శనం అని చెప్పారు. అవి కేవలం ప్రమాణ స్వీకార సభలో పలికిన మాటలు కావు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ సాగిన ఆమె జీవితానికి నిదర్శనంగా నిలిచాయి. నేడు ఒక గిరిజన చిన్నారి రాష్ట్రపతి భవన్‌ను చూసినప్పుడు.. అది ఇకపై తనకు దూరంగా ఉన్న ఒక అధికార సంస్థగా కనిపించదు. గ్రామీణ పాఠశాలలో చదివిన, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన, గ్రామీణ మార్గాల్లో ప్రయాణించిన, జీవితంలో వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ విద్య, ప్రజాస్వామ్యం, ప్రజాసేవలపై విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోని వ్యక్తి అక్కడ ఉన్నారనే స్ఫూర్తి కనిపిస్తుంది.

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య

ఈ రోజు మీరు ఒక డిగ్రీని అందుకుంటున్నారు. కానీ రేపు జీవితం మిమ్మల్ని ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. మీ వల్ల సమాజానికి ఎలాంటి మార్పు వచ్చిందని అడుగుతుంది. విద్య అసలు ఉద్దేశం కేవలం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదు... ప్రజల జీవితాలను మార్చే పరిష్కారాలను చూపడమే అసలైన విద్య. ప్రస్తుతం మనం ఏఐ యుగంలో జీవిస్తున్నాం. ఏఐ సమాధానాలను ఇవ్వగలదు. కానీ మానవీయ విలువలు, జిజ్ఞాస, కరుణ, వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ భర్తీ చేయలేదు. ఈ విలువలు గొప్ప విశ్వవిద్యాలయాల్లోనే పెంపొందుతాయి. అవే గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దుతాయి. అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను మాత్రమే కాదు.. బాధ్యతాయుతమైన పౌరులను, మానవతా దృక్పథం కలిగిన నాయకులను, జీవితాంతం నేర్చుకునే వ్యక్తులను తయారు చేయాలి.

విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కలలుగన్న వికసిత్ భారత్ లో నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, పరిశోధనలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కేంద్ర బిందువులుగా నిలుస్తాయి. ఉన్నత విద్యను మరింత బలోపేతం చేస్తూ.. భారత యువతకు మరిన్ని అవకాశాలను కల్పిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి అభినందనలు. ఈ జాతీయ దార్శనికత నుంచి స్ఫూర్తి పొందుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. జ్ఞానాన్ని సృష్టించే, ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చే విద్యార్థులను కేవలం ఉద్యోగాలకే కాకుండా నాయకత్వానికి సిద్ధం చేసే విశ్వవిద్యాలయాలను నిర్మిస్తున్నాం. మా లక్ష్యం కేవలం డిగ్రీలు అందుకున్న విద్యార్థులను తయారు చేయడం కాదు... భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడం. నాణ్యమైన అధ్యాపక బృందం, పరిశ్రమల అవసరాలకు అనుసంధానమైన నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయవంతం అయ్యేలా భవిష్యత్‌ విశ్వవిద్యాలయాలను నిర్మిస్తున్నాం. 

యువతలో ఆత్మవిశ్వాసం నెలకొల్పడమే లక్ష్యం

మా లక్ష్యం సులభంగా ఉన్నప్పటికీ ఎంతో ఉన్నతమైంది. ప్రతి విద్యార్థి ఉపాధికి అర్హుడు కావాలి, ప్రతి విశ్వవిద్యాలయం ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలి, ప్రతి పరిశోధకుడు సాధికారత పొందాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభతో పోటీ పడగలమనే ఆత్మవిశ్వాసం ప్రతి యువతలో ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ డిగ్రీని గర్వంగా ఫ్రేమ్ చేయించుకుంటారు. కానీ మీ నిర్ణయాలు, మీ విలువలు, సమాజానికి మీరు చేసిన సేవలనే జీవితం గుర్తుంచుకుంటుంది. మీ వల్ల ఎన్ని జీవితాలు మారాయి, ఎన్ని సమస్యలకు పరిష్కారాలు చూపించారు, ఎంతమందికి అవకాశాలు కల్పించారనేదే మీ విజయానికి ప్రామాణికం కావాలి. 

వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి

ఇతరుల జీవితాలను మార్చగల శక్తిని మనకు ఇచ్చినప్పుడే విద్య పరమార్థం నెరవేరుతుంది. ఈ రోజు మీరు ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటకు అడుగుపెడుతున్నప్పుడు... మీ జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో, మీ మూలాలను గర్వంతో, మీ విలువలను వినయంతో మీతో పాటు తీసుకెళ్లండి. డిగ్రీ మీకు ఒక వృత్తిని అందించవచ్చు... కానీ మీ వ్యక్తిత్వమే మీకు గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. సమాజానికి మీరు చేసే సేవే మీకు చిరస్థాయిగా నిలిచిపోయే వారసత్వాన్ని అందిస్తుంది. మీ ప్రయాణం మరెందరో జీవితాలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. 

అంతకుముందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ మదన్ లాల్ మీనా, వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టీ.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-46-39-0639.jpg

విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం.. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్
2026-06-30 Time: 04:46:39

11-28-46-0646.jpg

మహారాష్ట్ర సీఎం  శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ తో డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
2026-06-30 Time: 11:28:46

10-40-10-0610.jpg

రేపు  నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. 
2026-06-30 Time: 10:40:10

29-06-2026-11-55-50557.jpg

రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం.. గుంటూరులోని ఏరువాక పౌర్ణ‌మి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ..
2026-06-29 Time: 05:24:30

16-30-27-0627.jpg

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం.. మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ.. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
2026-06-29 Time: 04:30:27

Related Videos