విశాఖ: విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో ‘మానవ అక్రమ రవాణా మరియు బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం-1976’ పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సమాజంలో చట్టాలు మరియు న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనది. పోలీసు వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుతుందని, తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టం అవుతుందని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో 'ఆపరేషన్ ట్రేస్' ద్వారా ఇప్పటివరకు 900 మంది చిన్నారులను రక్షించగలిగాము. అలాగే వివిధ దేశాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన 180 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాం అని అన్నారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రాకుండా కఠిన శిక్షలు పడేలా చేయడంలో అధికారులు చూపుతున్న చొరవ అభినందనీయం. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్, ప్రాసిక్యూషన్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తూ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సత్కరించి, వారికి అవార్డులు అందజేశారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామకోటేశ్వరరావు గారు మరియు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సుమారు 200 మంది అధికారులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్, మానవ అక్రమ రవాణా నిర్మూలనలో కీలక మార్పులకు నాంది కావాలని హోంమంత్రి అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos