పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం: రైతుల భూ హక్కుల రక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించిన “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వ పాలనలో భూ రికార్డులు తారుమారు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణలుగా నిలిచాయని సీఎం కొనియాడారు. వివాదాలు లేని ప్రాంతాల్లో కూడా గత పాలకులు భూ వివాదాలు సృష్టించి ప్రజలకు నష్టం చేశారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములపై ప్రభుత్వ నియంత్రణ పెంచే ప్రయత్నం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి భూ యజమానుల హక్కులను కాపాడిందని తెలిపారు. భూమి రైతులదైతే, రికార్డులపై ఫోటోలు మాత్రం గత పాలకులవిగా ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు. భూ సమస్యల పరిష్కారానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. కరెన్సీ నోట్ల తరహాలో భద్రతా ఫీచర్లతో కూడిన రాజముద్ర పాస్ పుస్తకాలను రైతులకు జారీ చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. భవిష్యత్తులో మొత్తం 90 లక్షల మందికి ఎలాంటి వివాదాలు, అక్షరదోషాలు లేకుండా పాస్ పుస్తకాలు జారీ చేయడమే లక్ష్యమన్నారు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చామని, వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. అలాగే వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేసి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు.
వ్యవసాయం, ఆక్వా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఫీడ్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లామని వెల్లడించారు.

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. డీఎస్సీ ద్వారా దాదాపు 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు.ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, భూ రికార్డుల తారుమారులో వారి పాత్ర ఉందని ఆరోపించారు. ప్రజలకు తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, భూ హక్కుల రక్షణలో తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలు కూడా అభివృద్ధికి తోడ్పడాలని సీఎం చంద్రబాబు  పిలుపునిచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos