ఇదేమిటి... 1 నుంచి 5వరకు ... ఈ అంకెలేమిటీ అనే అనుమానమే కదా మీకందరికీ వస్తోంది. అదేనండి... తిరుమలలో టీటీడీ, అటవీశాఖాధికారులు సంయుక్తంగా ఇప్పటివరకు బంధించిన చిరుత పులులు సంఖ్య ఇది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిరుత పులులను బంధించారు. ఇదే ఆఖరుది ... ఇకపై భయం లేదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి కానీ... ఏమో .. ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయోననే సందేహం మాత్రం భక్తులను వెంటాడుతోంది. తాజాగా, తిరుమల నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం -7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో 5వ చిరుత చిక్కింది. దీంతో రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను బంధించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల అలిపిరి నడకమార్గంలో చిరుతదాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి ... అప్పటి నుంచి చిరుతలను పట్టుకుంటున్నారు అధికారులు. చిరుతను బంధించినప్పుడల్లా టీటీడీ ఈవో, ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తుల రక్షణే తమ తొలి ప్రాధాన్యమని చెబుతున్నారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని చెబుతున్నారు. ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది... ఇంకా ఎన్ని చిరుతలు ఉండొచ్చు అనే అంచనాలు మాత్రం అధికారుల వద్ద లేవనే విమర్శలు ఉన్నాయి. టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది కలిసి ఈ ఏడాది జూన్ 24న మొదటి చిరుతను బంధించారు. ఇకపై అంతా ప్రశాంతమే అనుకున్నారంతా... కానీ ఆగస్టులో అసలు కథ మొదలైంది. చిన్నారిపై చిరుత దాడిచేసి చంపేసిన తరువాత అధికారులు ప్రత్యేకంగా ట్రాప్ లు ఏర్పాటు చేయడంతో పాటు కెమెరాలు ఫిక్స్ చేశారు. ఇలా అష్టదిగ్బంధం చేసిన తర్వాత వరుసగా చిరుతలు బోనులో చిక్కుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆగష్టు 14, 17తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు చిరుతలు బోనులో చిక్కాయి. ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ ఆగష్టు 28న మరొకటి బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో ... మళ్లీ సెప్టెంబర్ 6వ తేదీ అయిదో చిరుత చిక్కింది. ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా ఉన్నాయా అన్న అనుమానం మాత్రం భక్తుల్లో నెలకొంది. ఇప్పటికైతే అయిదు... ఇంకా మరెన్ని చిరుతలు బోనులో చిక్కుతాయోనని భక్తులు గుసగుసలాడుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos