టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సోమవారం యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారడమే కాకుండా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌తో కలిసి కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి, దేవాన్ష్ పాదయాత్ర చేస్తున్నారు. చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆనందంతో యువగళం బృందాల సభ్యులు కేరింతలు కొడుతున్నారు. వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
కాగా... నారా లోకేష్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో నారా బ్రాహ్మణి ట్విట్టర్ ద్వారా స్పందించారు. లోకేష్ మూడువేల కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజుల కొత్తూరు వద్ద జరిగిన పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదిక ద్వారా బ్రాహ్మణి షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జనవరి 27వ తేదీన నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని లోకేష్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో... లోకేష్ తన పాదయాత్రను అదే రోజున నిలిపివేయాల్సి వచ్చింది. చంద్రబాబుపై వరుస కేసులు నమోదు కావడంతో న్యూఢిల్లీలో న్యాయనిపుణులతో చర్చల నిమిత్తం లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన లోకేష్ ... డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుండి తిరిగి తన పాదయాత్రను పున:ప్రారంభించారు. కానీ... మిచౌంగ్ తుఫాను కారణంగా మరోసారి లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి నాలుగురోజుల కిందట తిరిగి ప్రారంభించారు. మొత్తానికి ఇప్పటివరకు నారా లోకేష్ 219 రోజుల్లో, పది ఉమ్మడి జిల్లాల్లో, 92 నియోజకవర్గాలు... 217 మండలాలు... 1915 గ్రామాల్లో ... 70 బహిరంగ సభలు... 145 సమావేశాల్లో లోకేష్ పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos