రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు వారం రోజుల పాటు కురిసిన భారీ, అత్యంత భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగడమే కాకుండా... పలు జిల్లాల్లో వంతెనలు తెగిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఏమేరకు పంట నష్టం జరిగిందో లెక్కలు వేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. భారీవర్షాలకు శుక్రవారం ఒక్క ములుగు జిల్లాలోనే మరో 14 మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 23కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 14 మంది మృతుల్లో, ఎనిమిది మంది కొండాయి గ్రామస్తులే. గురువారం ఏటూరునాగారం గ్రామంలో వరద ఉద్ధృతికి జంపన్న వాగులో బాధితులు కొట్టుకుపోయారు. గ్రామం మొత్తం ముంపునకు గురైంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన గ్రామస్తుల కోసం ఐఏఎఫ్ హెలికాప్టర్లతో 600 కిలోల అత్యవసర సామగ్రిని విడిచారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామస్తులను ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాలకు తరలించారు. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ములుగులోని ఇతర గ్రామాల్లో మల్యాల, దొడ్ల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలనుంచి నిర్వాసితులను పడవల ద్వారా ఖాళీ చేయించారు. ములుగుతో పాటు మహబూబాబాద్, అసిఫాబాద్, వరంగల్, సూర్యాపేట, వికారాబాద్, పెద్దపల్లిలో గత వారం రోజులుగా మరణాలు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో అప్రోచ్ రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఆరు అడుగులకు మించిన ఎత్తులో నీరు ప్రవహించడంతో అధికారులు హెలికాప్టర్లతో గ్రామంలోని 1,900 మంది నివాసితులను ఖాళీ చేయించవలసి వచ్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. దాదాపు వెయ్యి మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించి సహాయక కేంద్రాల్లో ఉంచారు. కొత్తగూడెంలోని ముత్తాపురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న 12 మందిని ఈతగాళ్ల సాయంతో రక్షించారు. నిర్మల్లో వరద నీటిలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జూన్ 1 నుంచి జులై 26 వరకు తెలంగాణలో 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 313.9 మి.మీ కంటే 33 శాతం అధికంగా నమోదైంది.
మరోవైపు... రుతుపవన ద్రోణి బంగాళాఖాతం వరకు విస్తరించడంతో ఏపీలోని కోస్తా, రాయలసీమల్లో వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన ప్రవాహం బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా... గోదావరి నీటిమట్టం పెరగడంతో ఏపీలోని 5 జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని, వారికి 25 కిలోల బియ్యం, కిలో బంగాళాదుంప, కంది పప్పు, ఉల్లి, పామాయిల్ ఉచితంగా ఇవ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సహాయక శిబిరాల్లో సౌకర్యాలు అద్భుతంగా ఉండాలనీ, బాధిత కుటుంబాలు, వ్యక్తులను వారి ఇళ్లకు తిరిగి పంపినప్పుడు వారికి వరుసగా రూ.2,000 ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. బాధిత ప్రజలకు పక్కా ఇళ్లు ఉంటే వారిని ఇళ్లకు వెనక్కి పంపినప్పుడు మరమ్మతులు చేసేందుకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఎంత నష్టం వాటిల్లినా దానితో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నారు. గత నాలుగేళ్లలో మాదిరిగానే ఈసారి కూడా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలనీ, గర్భిణులు, బాలింతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సేవలను అధికారులు వినియోగించుకోవాలన్నారు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై పూర్తి పారదర్శకంగా గణన చేపట్టి బాధిత రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కాగా.. వరద ప్రవాహం కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కుల నుంచి 16 లక్షల క్యూసెక్కులకు పెరగనుంది. ఇదిలావుండగా... భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం కాస్త ఉపశమనం కలిగించింది. ఇప్పటికిప్పుడు భారీ వర్షాల ముప్పు లేదని వచ్చే వారం ... రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. సో... గత వారం రోజులపాటు అతలాకుతలం సృష్టించిన వానలు... రాబోయే వారం పాటు తెరపినిచ్చి.. కాస్త రిలీఫ్ ఇస్తాయని వాతావరణ శాఖ సూచనలను బట్టి తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos