నిన్నమొన్నటి వరకు 8 కిలోల టమోటా ధర వందరూపాయలు ఉండగా... ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిలో టమోటా125 నుంచి 130 రూపాయల వరకు పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వాటిని కొనలేక ఠారెత్తిపోతున్నారు. సాధారణంగా మనదేశంలో ఒరిస్సా, ఛత్తీస్ గడ్, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల్లో టమోటా పంటను విస్తారంగా సాగు చేస్తారు.
సీజన్ ప్రారంభమైన నాటి నుంచి, మన రాష్ట్రం మినహా.. మిగిలిన రాష్ర్టాల్లో టమోటా పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఏపీలోని మదనపల్లె ప్రాంతానికి చెందిన టమోటాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. గతంలో లేనంత అత్యధికంగా ధర పలుకుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా తోటలు బురదగా మారడంతో కోత కోసేందుకు కూలీలు లభించడం లేదు. దీంతో మార్కెట్కు టమోటా కాయలు తక్కువ వస్తున్నాయి. అంతేకాకుండా... మిగిలిన రాష్ట్రాల్లో పంట కాపు లేకపోవడం కూడా ధర పెరగడానికి కారణమై ఉండవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె టమోటా మార్కెట్కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సీజన్లోనూ.. ఇక్కడ వందల కోట్ల రూపాయల టమోటా వ్యాపారం జరుగుతుంది.
మదనపల్లె టమోటా మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ.124 ధర పలికి చరిత్ర సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో వేసవి కాలమైన మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో సుమారు 2214 హెక్టార్లలో టమోటా సాగు అయింది. అధికారులు పేర్కొన్న ప్రకారం.. ఈ నెల 28న మదనపల్లె మార్కెట్కు 1397 మెట్రిక్ టన్నుల టమోటా వచ్చింది. అప్పటి నుంచీ ... మార్కెట్ కు టమోటా దిగుబడులు రావడం క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం 750 టన్నుల టమోటా కాయలు రావడంతో.. ఒకసారిగా ధర పెరిగి... కిలో రూ.124 వరకు పలికింది.
డిమాండ్, సప్లయ్ల మధ్య పొంతన లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. కూరగాయలు ఎక్కువగా పండే ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడం పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో, కూరగాయల సరఫరా తగ్గిందని పేర్కొంటున్నారు. నిన్నమొన్నటివరకు టమోటాను అడిగే నాథుడే లేకపోవడంతో... పలువురు రైతులు పొలాల్లోనే పంటను కోత కోయకుండా.. అలాగే వదిలేశారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక.. అప్పుల పాలైన రైతులూ ఉన్నారు. అయితే అనుకోకుండా ... ఒక్కసారిగా.... గత వారం రోజులుగా టమోటా ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా టమోటా రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుండగా... సాధారణ ప్రజల ముఖాలు మాత్రం దిగులుగా మారాయి.
ఇప్పటికే పొలాల్లో కోతలు ఎండిపోయి.. వదిలేసిన తోటలకు కూడా మరోసారి చిగురు వచ్చే అవకాశం ఉండడంతో ఎరువులు, మందులు పిచికారీ చేస్తున్నారు. ఇదే ధరలు మరిన్ని నెలలు కొనసాగితే.. తాము అప్పుల ఊబిలో నుంచి బయటపడతామని పలువురు రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా తిరిగి టమోటా పంట పండి... దిగుబడులు విస్తారంగా మార్కెట్ కు వస్తేకానీ... ధరలు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు. రానున్నది వర్షాకాలం కాబట్టి ... టమోట ధరలు అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఎప్పుడొస్తొందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos