అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా మే 1 లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏపై ఉన్నా.. ఇప్పటివరకు చెల్లించలేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. కోర్టుకు వెళ్లిన వారికే కౌలు వేస్తామన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్, ఏపీసీఆర్డీఏ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది. కౌలు చెల్లింపునకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య సంయుక్త కార్యదర్శి కల్లతో రాజశేఖర్ రెడ్డి, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. కౌలు చెల్లించేలా ఆదేశించాలని, జాప్యానికి వడ్డీ, చట్ట నిబంధనలను అనుసరించడంలో విఫలమైన అధికారుల నుంచి పిటిషనర్ సొసైటీ సభ్యులకు పరిహారం ఇప్పించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు, వాదనలు వినిపించారు. సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు వేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని... కౌలు చెల్లింపు కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామని... బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని... వడ్డీ చెల్లింపునకు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదని... కౌలు చెల్లింపు వ్యవహారంతో సీఎస్ కు సంబంధం లేదని... పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos