ఎన్నికల వేళ మహిళా బిల్లు ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును కేంద్రప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాజకీయవర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనకు రాబోయే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఇప్పటికే అభ్యర్దుల ఎంపికపైనా కసరత్తు మొదలైంది. ఈ సమయంలోనే మహిళా బిల్లు తెర మీదకు వచ్చింది. ఈ బిల్లు కారణంగా మహిళలకు కేటాయించే స్థానాలపై స్పష్టత వచ్చింది. కాగా... నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ బిల్లు అమలవుతుందని తెలిసి ఊరట చెందారు. అయినాసరే... ఏపీలోని 175 శాసనసభ, 25 లోక్ సభ నియోజకవర్గాల స్థానాల్లో మహిళలకు ఏయే స్థానాలు వెళతాయన్నదానిపై చర్చ నడుస్తోంది. ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశం ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే... రాష్ట్రంలో ఉన్న 25 లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా.. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలైతే 8 స్థానాలు మహిళలకు కేటాయించాలి. పునర్విభజనలో లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. సంఖ్య కూడా పెరుగుతుంది. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న మొదటి 8 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. ఆ లెక్క ప్రకారం విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి (ఎస్సీ), అనంతపురం, నంద్యాల, విజయవాడ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా.. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలైతే 58 స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయి. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న మొదటి 58 శాసనసభ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉండవచ్చు. ఈ నేపథ్యంలో... మహిళాబిల్లు అమలయ్యే పక్షంలో రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుందన్న చర్చ మొదలైంది. ఏయే నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయనే విషయంపై ప్రజాప్రతినిధులు ఆరాతీయడమే కాకుండా... ప్రత్యామ్నాయంగా తమ మహిళావారసులపైన ఫోకస్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos