ఒక విజన్‌తో తీసుకున్న నిర్ణయాలు, పాలసీలతో వచ్చిన ఫలితాలు నేడు కళ్లముందు కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజన్‌ ఇచ్చే ఫలితాలకు నేటి హైదరాబాద్‌ సాక్ష్యమని చెప్పారు. దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడానికి నాడు జరిగిన అభివృద్ధే కారణమని తెలిపారు. ఈ రోజు తెలంగాణ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించడానికి నాడు ఇక్కడ జరిగిన అభివృద్దే కారణమని అన్నారు. ఎన్నికల్లో గెలవడం వేరు.. అభివృద్ది చేయడం వేరు అని చెప్పారు. నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ది చేశామని... కానీ 2004 ఎన్నికల్లో తాము ఓడిపోయామని అన్నారు. అందుకే అభివృద్ధిని ఎన్నికల ఫలితాలను పోల్చి చూడనని అన్నారు. త్రిపుల్ ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్ లో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలకు అభివృద్ది ఫలాలు చేరడం తనకు అత్యంత సంతృప్తినిస్తుందని... దేశంలో స్మార్ట్ సిటీలతో పాటు... స్మార్ట్ విలేజ్‌లు కూడా రావాలనేదే తన అభిమతమని అన్నారు. నాడు రాష్ట్రం కోసం అనేక అంశాల్లో ప్రధాని వాజ్ పేయిపై ఒత్తిడి తెచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. నిన్ను చూస్తుంటే దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకువెళ్లేలా ఉన్నావని ఆనాడు వాజ్ పేయి తనను అన్నారని చెప్పారు. ఐటీ అనేది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ అవుతుందని నాడే గుర్తించానని... ఇందులో భాగంగానే ఐటీ సంస్థలను ప్రోత్సహించామని, ఐటీ సంస్థల్లో పనిచేయడానికి త్రిపుల్ ఐటీ వంటి సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం సందర్భంగా సీఎం హోదాలో తనను చైర్మన్‌గా ఉండమన్నారని...  కానీ ఆ రంగనిపుణులు దానికి హెడ్ గా ఉండడమే కరెక్ట్ అని తాను చెప్పానని అన్నారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, ఇలాంటి సంస్థలకు తాము అధిపతులుగా ఉండకూడదని చెప్పానని చంద్రబాబు నాటి అనుభవాలను పంచుకున్నారు. నాడు నేను స్థాపించిన ఈ ట్రిపుల్ ఐటీ... టాప్ 10 సంస్థల్లో స్థానం పొందడం పట్ల తాను గర్విస్తున్నానని అన్నారు. మైక్రోసాఫ్ట్‌ వస్తే అన్ని సంస్థలు వస్తాయని గ్రహించానని, దాని కోసమే బిల్‌గేట్స్‌ను ప్రజెంటేషన్‌ ద్వారా మెప్పించి... మైక్రో సాఫ్ట్ తీసుకువచ్చానన్నారు. పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులకు రూప కల్పన చేశానని... జీనోం వ్యాలీ నా హయాంలోనే ఏర్పాటైందని ... అత్యుత్తమ పాలసీ వల్లనే ఐఎస్ బీ హైదరాబాద్‌కు వచ్చిందని అన్నారు. గట్టి ప్రయత్నం వల్లే ఫార్మా ఎక్స్‌పోర్టు కౌన్సిల్‌ వచ్చిందని ... విజన్‌తో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, అందుకే విజన్‌ 2047ను ప్రతిపాదించానని తెలిపారు. విజన్‌ 2020 ద్వారా 20 ఏళ్లలో సాధించిన ఫలితాలు మన కళ్ల ముందున్నాయని చెప్పారు. ‘రెస్ట్‌, ఫుడ్‌, వర్క్‌ను సమన్వయం చేసుకోవడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చని... అందుకే న్యూట్రిఫుల్‌ అనే యాప్‌ను సిద్ధం చేశామని... దీని ద్వారా 80 వేల మంది సేవలు పొందుతున్నారని... దీన్ని మరింత విస్తరిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫ్యాకల్టీ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పారు. ఇక్కడ చదువుకుంటున్న వారంతా ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని, తద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించే వీలు ఉంటుందని అన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీని ఉత్తమమైన సంస్థగా నడుపుతున్న యాజమాన్యానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమావేశానికి ప్రొఫెసర్ రాజిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos