ఏపీలో సర్పంచ్‌లు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సర్పంచులు సైతం న్యాయం కోసం పోరుబాట పట్టారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడుతూ  ఆందోళనకు దిగారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలను జగన్‌ సర్కార్ దుర్వినియోగం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు.  రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నిధుల దుర్వినియోగంపైనా... పక్కదారి పట్టడం పైనా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సర్పంచుల సంఘం, పంచాయితీ రాజ్ ఛాంబర్ నిర్ణయించాయి. ఈ మేరకు ఆగష్టు రెండో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.  

ఏపీ సర్పంచ్ ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచ్‌లను కూడా కలుపుకొని చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతారు. 100 మంది వరకు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను, ఆర్థిక శాఖ,  గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులతోపాటు ఇతర పెద్దలను, అధికారులను కలవబోతున్నారు.
కలిసిన తర్వాత రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల, పంచాయతీల, సర్పంచుల దుస్థితిపై మెమోరాండం సమర్పించనున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ.8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా, దొంగిలించి, దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వినియోగించుకుందని వారు అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2010 కోట్లు, 2023 -24 సంవత్సరంలో 2035 కోట్లు... ఇలా మొత్తం రూ.4045 కోట్లు ఇంకా పంచాయతీలకు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయాలన్నింటిని కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.  

అంతేకాకుండా... ఉపాధి హామీ చట్టం కింద వచ్చే నిధులు ... చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను హైజాక్ చేసి తన సొంత అవసరాలకు, పథకాలకు కట్టబెట్టుకుంటుందని సర్పంచులు విమర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీలను, సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, వార్డు మెంబర్లను రాష్ట్ర ప్రభుత్వం డమ్మీలుగా చేసిందని ...  వారి అధికారాలను రాజ్యాంగేతర శక్తులుగా మారిన వాలంటీర్లకు కట్టబెట్టారని విమర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జప్పీటీసీలకు, వార్డు మెంబర్లకు సమాంతరమైన పోటీ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని అంటున్నారు.

రాష్ట్రంలోని 12,918 మంది గ్రామ సర్పంచులు కనీసం తాగునీరు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని, జల జీవన్ మిషన్ పథకాన్ని మూలన పడేశారని సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన 8,660 కోట్ల రూపాయల నిధులపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి, సీబీఐతో విచారణ చేయించాలనే తదితర డిమాండ్లను లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారని తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సర్పంచుల మొర ఆలకిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో చూడాలిమరి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos