మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా నటించిన చిత్రం భోళా శంకర్ ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాంబ్రహ్మం సుంకర నిర్మాత. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కొన్ని వివాదాస్పద అంశాలను టచ్ చేసి... తనదైన శైలిలో పంచ్ లు పేల్చడం చర్చనీయాంశంగా మారింది. హైపర్ ఆది మాట్లాడుతూ... కొందరు తెలివైన శాడిస్టులు ఉంటారని.. అన్నయ్యని పొగుడుతూ తమ్ముడిని తిడతారని అన్నారు. ఇటీవల నేను పాలిటిక్స్ ఫాలో కావడం లేదని... ఒకసారి షూటింగ్ సమయంలో చిరంజీవి నాతో అన్నారని.. ఎందుకని నేను అడిగితే నా తమ్ముడిని తిడుతుంటే నేను చూడలేనని అన్నారంటూ హైపర్ ఆది కామెంట్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... అన్నయ్య మంచోడు కాబట్టే ముంచేశారని.. కానీ తమ్ముడు మొండోడని.. అన్నయ్యని తిట్టిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తారని ఆది అన్నారు. ఇక భోళా శంకర్ చిత్రం విషయం మాట్లాడుతూ... వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్ పండిందని... ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్ బాగా అలరిస్తుందని అన్నారు. భోళా శంకర్ సినిమా కలెక్షన్స్ కోసం నిర్మాతలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని... ఎందుకంటే ఈ మధ్యన ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు వెనకేసుకున్న కలెక్షన్స్ తో పోల్చుకుంటే మన కలెక్షన్స్ తక్కువే అంటూ.. బ్రో చిత్రం వివాదంపై హైపర్ ఆది పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇదిలావుండగా.. చిరంజీవి రీమేక్ సినిమాలకే పరిమితమవుతున్నారంటూ కొందరు చేస్తున్న కామెంట్స్‌కు ఈ సందర్భంగా చిరంజీవి స్పందించారు. తనదైన శైలిలో దీటైన సమాధానమిచ్చారు. ‘నాకు నచ్చితేనే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను’ అని ‘ఖైదీ నం.150’లో ఉన్న డైలాగ్ ను ఉదహరిస్తూ... ‘భోళాశంకర్’ నాకు నచ్చింది కాబట్టే చేశాను... నాకు నచ్చింది కాబట్టే చూశాను... ఈ సినిమా మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నానని చిరంజీవి అన్నారు. ‘రీమేకులే చేస్తారేంటి’ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారని... మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నం చేస్తే తప్పేంటో నాకు అర్థం కావట్లేదని ఆయన అన్నారు. ఈ సినిమా మాతృక చిత్రం ‘వేదాళం’ ఏ ఓటీటీలోనూ లేదని... ఎవ్వరూ చూసి ఉండరనే ధైర్యంతోనే దర్శక, నిర్మాతలు నా దగ్గరకు వచ్చి... నన్ను ఒప్పించారని.. అని అన్నారు. ‘ఈ సినిమా సూపర్‌హిట్’ అని మా అందరి మనసులో నాటుకుపోయిందని... ఆ ఫీలింగే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చిరంజీవి అన్నారు. ‘ఈ ఇండస్ర్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని... టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ స్థానం ఉంటుందనే విషయం తమ్ముడు పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమా వేడుకలో అన్నాడని... నేనూ అదే చెబుతున్నానని చిరంజీవి అన్నారు. మా ఇంటి హీరోలను మేం పుష్ చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని అన్నారు. యంగ్ టాలెంట్ ను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మా ఇమేజ్ ఉపయోగపడుతుందంటే సపోర్ట్ చేయడానికి ముందుంటామని... అలాంటి వారికి చేయూతనివ్వడాన్ని బాధ్యతగా భావిస్తానని చిరంజీవి అన్నారు. చిత్రపరిశ్రమ ఒక పుష్పక విమానం, అక్షయ పాత్రలాంటిది... ఎంతమంది వచ్చినా అక్కున చేర్చుకుంటుందని చిరంజీవి అన్నారు. మొత్తానికి హైపర్ ఆది పంచ్ లు సినీ రాజకీయ వర్గాల్లో సెన్సేషనల్ గా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos