టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఆదినుంచి ఉల్లాసంగా సాగుతున్న పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో జరుగుతోంది. నర్సాపురంలో యువగళానికి జనం బ్రహ్మరథం పట్టారు. యువనేత లోకేశ్‌కు నర్సాపురం పట్టణ ప్రజల అపూర్వ స్వాగతం పలికారు. అడుగడగునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. యువనేతకు సంఘీభావంగా భారీగా రోడ్లవెంట ప్రజలు బారులు తీరారు. లోకేశ్‌ను కలిసి ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీ పడ్డారు. భవనాలపై నిలబడి యువనేతకు స్థానికులు అభివాదం తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నర్సాపురం జగన్నాథ ఆలయం సమీపంలో చేనేత కార్మికులు లోకేశ్‌ను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నామని అన్నారు. మేము అధికారంలోకి వస్తే... గుర్తింపు కార్డులు అందజేసి సంక్షేమ పథకాలన్నీ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేసేలా కేంద్రంతో మాట్లాడతామని, వీలుపడకపోతే రాష్ట్రమే జీఎస్టీ భరించేలా చేస్తామన్నారు. మగ్గం ఉన్న ప్రతీ చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని యువనేత హామీ ఇచ్చారు. అదేవిధంగా... స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ... నర్సాపురంలో శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ ద్వారా 24 గంటల పాటూ శుద్ధమైన నీటిని కుళాయి ద్వారా ఇంటింటికీ అందిస్తామన్నారు. నర్సాపురంలో పేరొందిన లేస్ పరిశ్రమకు రాయితీలిచ్చి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ పాదయాత్రకు ప్రతిచోటా ప్రజలు వెల్లువెత్తుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos