తెలంగాణ బీజేపీలో ఇటీవల కాలంలో మొదలైన అంతర్గత విభేదాలు సమసిపోయినట్లు బయటికి కనిపిస్తున్నాయి కానీ లోలోపల అసమ్మతి, అసంతృప్తి నిప్పు రాజుకుంటూనే ఉంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమలో ఉమ్మడి ఏపీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆ పార్టీలోని విజయశాంతి సహా పలువురు నేతలకు నచ్చలేదు. సమైక్య ఆంధ్రకు జైకొట్టిన కిరణ్ కుమార్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని విజయశాంతి ... తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. టీబీజేపీ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. బీజేపీ అధిష్టానం మాత్రం ... తెలంగాణలో ఆయన సేవలను వినియోగించుకునే స్ట్రాటజీలో ఉందని ఆ పార్టీలోని నేతలే అంటున్నారు. ఈ క్రమంలో... కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వల్ల ... బీజేపీకి ఎంతమేరకు సానుకూలం అవుతుందో లేదో కానీ.. ఈ అంశం మాత్రం బీఆర్ఎస్ కు బాగా కలిసొస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి... బీజేపీని టార్గెట్ చేసింది బీఆర్‌ఎస్. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం అనేదే ఇప్పుడు బీఆర్ఎస్ పొలిటికల్ మెయిన్ పాయింట్ అయింది.
కిరణ్ కుమార్ శిష్యుడిగా కిషన్‌రెడ్డి, చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారని మంత్రి హరీష్‌రావు ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ద్రోహులని... వారు తెలంగాణను శతవిధాలా అడ్డుకున్నారని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విధంగా... బీజేపీకి కొత్త సారథిగా వచ్చిన కిషన్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ పెద్ద కుర్చీలో ఉన్న రేవంత్‌రెడ్డినీ.. ఒకే వ్యూహంతో ఇరకాటంలో పెడుతోంది గులాబీ దండు. బీఆర్ఎస్ నేతల తెలంగాణ సెంటిమెంట్ దాడి నేపథ్యంలో సమైక్యవాదిగా పేరు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఏ మేరకు బీజేపీకి ఉపయోగపడతారనే చర్చ జరుగుతోంది. విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. కిరణ్ ఎంట్రీ ద్వారా తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఓట్లను సంపాదించుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం అంచనా వేసి ఉండవచ్చు. కానీ ఇప్పటికే ఇక్కడి రాజకీయాల్లో అనుభవం గడించిన రేవంత్ రెడ్డి, షర్మిల వైపు మాత్రమే తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం మొగ్గు చూపుతోందని కొందరి అభిప్రాయం. తద్వారా రెడ్డి సామాజిక వర్గం ఓట్లలో చీలిక ఏర్పడుతుందని... తద్వారా... బీఆర్ఎస్ కే కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో... ఢిల్లీ డైరెక్షన్‌లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos